పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి నిజం చేస్తూ.. అమెరికాలో 12 ఏండ్ల ఓ తెలుగు బాలుడు తన సత్తా చాటాడు. న్యూజెర్సీలో సోమర్‌సెట్‌లోని సెడార్ హిల్ ప్రిపరేటరీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న సాహిత్ మంగు ప్రతిష్టాత్మక గార్డెన్ స్టేట్ డిబేట్ లీగ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కు చెందిన సాహిత్ మంగు కుటుంబం అమెరికా వెళ్లి అక్కడే న్యూజెర్సీలో స్థిరపడింది. అక్కడ ప్రతీ ఏడాది డిబెట్ లీగ్ టోర్నమెంట్లు జరుగుతాయి. అందులో గార్డెన్ స్టేట్ లీగ్ టోర్నిమెంట్ చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ డిబెట్ లీగ్‌లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ స్కిల్స్ చూపించడానికి వస్తారు. ఈ ఏడాది వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్‌లో పోటీ పడ్డారు. అయితే గెలుపు మాత్రం మన హైదరాబాదీ సాహిత్ మంగునే వరించింది. గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డు దక్కించుకున్నాడు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించడం.. అమెరికాలో అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలి.. ఫేసియల్ టెక్నాలజీ వల్ల చెడు కంటే మంచే ఎక్కువ… శాఖాహారమే మంచిది, మాంసాహారం సరైంది కాదు లాంటీ టాపిక్స్ ఎంచుకున్న సాహిత్ మంగు.. వీటిపై అనర్గళంగా మాట్లాడి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.తన స్నేహితుడితో డిబేట్‌లో పాల్గొని ఈ నాలుగు అంశాలపైనా విజేతగా నిలిచాడు. ఇండో అమెరికన్ అయిన సాహిత్ మంగు తెలుగులోనూ అనర్గళంగా మాట్లాడగలడు. ఇక ఈ అవార్డే కాదు.. అంతకముందు సింగింగ్‌లో కూడా మనోడు పలు అవార్డులను గెలుచుకున్నాడు.