Telangana PCC President Revanth Reddy allegations against congress party senior leaders
mictv telugu

సొంత పార్టీ నేతలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

March 14, 2023

Telangana PCC President , PCC Revanth Reddy, allegations against, congress party senior leaders,

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తమ పార్టీలోని పెద్ద రెడ్లు కేసీఆర్‌కు అమ్ముడు పోయారని ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి.. సోమవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన.. కాంగ్రెస్ పార్టీలోని పెద్దరెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారు కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చిందని అన్నారు. కేసీఆర్ ను సీరియస్ గా తీసుకోవడం మానేసామని, సీఎంను ఆ పార్టీ నేతలు కూడా సీరియస్ గా తీసుకోవడం మానేశారు అంటూ వ్యాఖ్యలు చేశారు. సీట్ల వారీగా సర్వే చేయడం లేదని పేర్కొన్న ఆయన ప్రజల మూడ్ పై సర్వే జరుగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందని చెప్పారు రేవంత్ రెడ్డి. తమకు 32 నుంచి 34 ఓటింగ్ శాతం ఉందని అన్నారు. మరో 5 శాతం ఓట్ల కోసం తమ పోరాటమని తెలిపారు. ఇక ఇదే సమయంలో దేశంలో కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందని, బీజేపీ బలంగా ఉందని చెప్పుకోవడం ఒక భ్రమ మాత్రమేనని, బీజేపీ బలంగా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవని పేర్కొన్న ఆయన, మళ్లీ తను ఎమ్మెల్యేగా కొడంగల్ నుండే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.

ఇంకా.. కాంగ్రెస్‌ పార్టీలో త్వరలోనే భారీ చేరికలు ఉంటాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌లో ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) చేరిక అంశం పార్టీ అధిష్టానం పరిధిలో ఉందని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్ర కాంగ్రెస్ కార్యక్రమమని.. తాను కూడా యాత్రలో పాల్గొంటానని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ ప్రజాస్వామయ్యంలో సరైనవి కావని అభిప్రాయపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో కూడా పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.