టీ.కాంగ్రెస్ కఠిన నిర్ణయం.. 11 మందికి షోకాజ్ నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

టీ.కాంగ్రెస్ కఠిన నిర్ణయం.. 11 మందికి షోకాజ్ నోటీసులు

November 20, 2022

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. పదకొండు మంది అధికార ప్రతినిధులకు పీసీసీ షోకాజ్ నోటీసులు అందజేసింది. హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన అధికార ప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 13 మంది అధికార ప్రతినిధులుండగా.. నిన్నటి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరైన సంగతి తెలిసిందే. హాజరు కాకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది.
మరోవైపు.. ఈ జూమ్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది టీ.కాంగ్రెస్. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు బీజేపీ, టీఆర్ఎస్ విధానాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎల్లుండి నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లుగా సమాచారం. మండల కేంద్రాలు, కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించారు.
ఇక ఇదే మీటింగ్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. దీనిపై ఆయనకు ఫోన్ చేశారు ఏఐసీసీ కార్యదర్శి జావెద్. పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడటానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలదేనన్న వ్యాఖ్యలపై జావెద్ వివరణ కోరినట్లు సమాచారం.