ఆ గ్రామంలో ప్రజలు నివసించేందుకు భయపడుతున్నారు. ఊరిలో లేకపోయినా ఫర్వాలేదు బతికుంటే చాలు అనుకొని తట్టాబుట్టా సర్దేశారు. నేడు ఏ ఇంటికి వెళ్లినా వేసినా తలుపులు..వాటికి వేసిన తాళం కప్పలే దర్శనమిస్తున్నాయి. దీనికి కారణం ఆ ఊరిలో జరుగుతున్న వరుస మరణాలే..
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలోని చందుపట్ల గ్రామంలో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల కాలంలో రోజుకి ఒకరి ప్రాణాలు పోతుండడం స్థానికులను భయపెడుతోంది. గత నెల రోజుల్లో 20 మంది చనిపోవడం పరిస్థి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెల 21 నుంచి పది రోజుల వ్యవధిలోనే 12 మంది మరణించారు. మరణానికి కారణం ఏదైనా.. వరుస మరణాలతో గ్రామస్తులకు మాత్రం కంటి మీద కునుకు ఉండడం లేదు. ఎప్పుడు ఏమవుతుందో తెలియక ప్రాణ భయంతో బతుకుతున్నారు.
ఇక వరుస మరణాలపై గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం గ్రామాన్ని మూకుమ్మడిగా ఖాళీ చేశారు. బడులు కూడా తెరుచుకోలేదు. అక్కడి నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమానికి కూడా కేవలం 11 మంది మాత్రమే హాజరయ్యారు. గ్రామానికి ఏదో దరిద్రం పట్టిందని భావించి తెల్లవారుజామునే ఊరు ఖాళీ చేసీ..శివారు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. గ్రామదేవతకు మేకలు, కోళ్లను బలి ఇచ్చారు. తమ ఊరికి పట్టిన కీడు పోవాలంటూ వేడుకున్నారు. అనంతరం అక్కడే వండుకొని సామూహిక భోజనాలు చేశారు. ఇక గ్రామంలో ఎవరూ లేకపోవడంతో దొంగతనాలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.