కాకతీయుల కాలం తర్వాత అంతరించిపోయిన పేరిణి నాట్యకళ ప్రచారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తగా ప్రచార కార్యక్రమాలతోపాటు ఆ కళను అభ్యసించేవారికి చేయూత కూడా అందిస్తోంది. దీంతో పలువురు ఔత్సాహిక కళాకారులు పేరిణిని నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు. వారికి తగిన గుర్తింపు కూడా లభిస్తోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ పేరిణి నృత్య కళాకారుడు ధరావత్ రాజ్‌కుమార్ నాయక్‌కు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురసార్-2022’ కింద ఆయనకు అవార్డుకు ఎంపిక చేశారు.
ఈ పురస్కారం అందుకున్న తొలి పేరిణి నాట్య కళాకారుడు రాజ్‌కుమారే. అవార్డు కింద రూ. 25 వేల నగదు, ప్రశంసాపత్రం అందజేశారు. పేరిణి కళకు కేంద్ర పురస్కారం రావడం కూడా ఇదే తొలిసారి. కాకతీయ రాజుల దగ్గర సేనాపతిగా పనిచేసిన జాయప సేనాని పేరిణి కళను ఆవిష్కరించారు. ఓరుగల్లు సామ్రాజ్యం పతనమైన తర్వాత ఆ కళ కనుమరుగైంది. 1970లలో పద్మశ్రీ నటరాజ రామకృష్ణ ఆ కళకు విస్తృత పరిశోధనతో మళ్లీ ప్రాణం పోశారు.