తెలంగాణవాసికి నరకం.. స్పందించిన కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణవాసికి నరకం.. స్పందించిన కేటీఆర్

May 8, 2019

సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చే సమస్యల పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పకుండా స్పందిస్తారు. మరోసారి ఆయన ఎడారిదేశంలో యజమానితో నరకయాతన అనుభవిస్తున్న ఓ బాధితుడిని రక్షించడానికి పూనుకున్నారు. బతుకుదెరువు కోసం అక్కడికి వెళ్లి చాలామంది నానా పాట్లు పడుతుంటారు. కొందరైతే చేయని నేరాలకు జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పొట్ట చేతబట్టుకుని అబుదాబి వెళ్లిన ఓ తెలంగాణవాసి కష్టాలు సోషల్ మీడియా ప్రచారంతో వెలుగులోకి వచ్చాయి.

కరీంనగర్ జిల్లాకు చెందిన సదరు బాధితుడు రెండేళ్ల క్రితం అబుదాబి వెళ్లాడు. అబుదాబికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద ఒంటెలు కాసే పనికి కుదిరాడు. అయితే యజమాని క్రూరంగా అతణ్ని హింసించడం ప్రారంభించాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టడం, కడుపుకు సరిగ్గా తిండి కూడా పెట్టకుండా వేధించసాగాడు. దీంతో బాధితుడు ఓ వీడియో ద్వారా తన బాధను తెలిపాడు.

Telangana person is difficult in Abu Dhabi .. KTR Responded

‘మాది కరీంనగర్ జిల్లా తుమ్మాపురం మండలం. మాది పేద కుటుంబం. రెండేళ్ల కింద అబుదాబికి వచ్చాను. మా యజమానికి వంద ఒంటెలు ఉన్నాయి. వాటిని నేనొక్కడినే చూసుకోవాలి. ఒక ఒంటె చనిపోవడంతో మా యజమాని నన్ను బాగా కొట్టిండు. దవడ పళ్లు ఊడి మాట్లాడరాకుండా కొట్టాడు. నేనుండే ప్రాంతంలో కరెంటు ఉండదు. సద్ది తెచ్చి ఇచ్చే వాళ్లు ఉండరు. పనంతా చేసి మా తిండి మేమే కట్టెల పొయ్యి మీద వండుకోవాలి. మా యజమాని జీతం ఇవ్వక, తిండి పెట్టక నిత్యం నరకం చూపిస్తున్నాడు. నా భార్య ఆస్పత్రిలో వుందని చెప్పినా పంపడంలేదు. మా అమ్మ చచ్చిపోయినా పంపలేదు. సార్ దయతలచి మమ్మల్ని ఇండియా తీసుకుపొండి’ అని ఆ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నాడు బాధితుడు.

ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. అతన్ని ఎలాగైనా విడిపించి భారత్‌కు రప్పించేలా చూడాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, యూఏఈలో భారత రాయబారిని కోరారు. కేటీఆర్ ట్వీట్‌కు యూఏఈ భారత రాయబారి నవదీప్ సూరి స్పందించారు. రియాద్‌లోని ఎంబసీ సదరు వ్యక్తి అంశాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. కేటీఆర్ చొరవకు చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.