రోడ్డెక్కితే కేసులు పెట్టండి, జైల్లో వేయండి.. పశువుల్లా ఈ కొట్టుడేంది ఖాకీలూ! - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డెక్కితే కేసులు పెట్టండి, జైల్లో వేయండి.. పశువుల్లా ఈ కొట్టుడేంది ఖాకీలూ!

March 24, 2020

Telangana police attacks on common people in the name of lockdown 

ఖాకీలు కోరికోరి రాష్ట్రపతి మెడల్ గెలుచుకోవచ్చు. కానీ, కోరికోరి రోగం అంటించుకోవాలన్న కోరిక ఎవరికీ ఉండదు. అది కూడా చికిత్సే లేని ఎయిడ్స్ వంటి కరోనా వైరస్‌ను ఇష్టంతో ఎవరూ ఆహ్వానించరు. కానీ తెలంగాణ, ఆంధ్రా పోలీసుల తీరు చూస్తుంటే జనం కరోనాను అంటించుకోడానికి మాత్రమే  రోడ్లపైకి వస్తున్నట్లు భావించాల్సి వస్తోంది. వృత్తిలో ఒత్తిడో, లేకపోతే రూల్స్ సరిగ్గా తెలియకో, లేకపోతే ఖాకీ బట్టలు, లాఠీ ఉన్నాయనే బలుపుతోనో కొందరు పోలీసులు వీధిరౌడీలకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రోడ్లుపై వచ్చిన వారిని పశువులను బాదినట్లు బాదుతున్నారు. తాము అచ్చోసిన ఆంబోతులమని నిరూపించుకుంటున్నారు. సీఎంలు స్వయంగా చెప్పిన విధివిధానాలకు కూడా తూచ్ కొడుతున్న పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆంధ్రజ్యోతి బ్యూరీ చీఫ్‌పై, యువతిపై, డాక్టర్లపై 

మీడియా ప్రతినిధులకు, అత్యవసర సేవలు అందించే వారికి లాక్’డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. అయితే వాస్తవంలో ఇది ఏమాత్రం అమలు కావడంలేదు. పోలీసులు పాత్రికేయులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. నిన్నా రాత్రి ఆంధ్రజ్యోతి పొలికల్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్‌పై  రామాంతపూర్ పోలీసులు దౌర్జన్యం చేశారు. అంబర్ పేట ఎస్సై లింగం విచక్షణా రహితంగా లాఠీతో కొట్టారు. మీడియాకు మినహాయింపు ఉందని మొత్తుకున్న వినకుండ కొట్టి పంపారు. హైదరాబాద్‌లో చాలా మంది పాత్రికేయులకు ఈ కొట్టుడు అనుభవం ఎదురైంది. ‘మీడియానా? ప్రతొక్కడూ మీడియానే, ఐడీ కార్డు పెట్టుకోవడం, మీడియా అనడం.. ’ అని ఖాకీలు కించపరుస్తున్నాయి. ఇక ఐడీ కార్డులు లేని వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

నర్సులా.. ఇళ్లకెళ్లండి.. 

సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి కూడా పోలీసులు చేతుల చేతుల్లో చేదు అనుభవం ఎదురైంది. ‘బయటికి ఎందుకొచ్చారు? ఏం కారిపోతోంది? మీరు డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. మర్యాదగా కొంపల్లో పడి ఉండండి’ అని వారిపై చేయిచేసుకున్నారు. దీనిపై నర్సులు నిరసన వ్యక్తం చేశారు. రూల్స్ ఏంటో చెప్పాలిగాని, ఇలా కొట్టడమేంది అని వాపోతున్నారు. ఖమ్మంలోనూ ఓ మెడికోపై ఖాకీ చేయి చేసుకుంది. తాను మమత మెడికల్ కాలేజీలో చదువుతున్నాని ఆమె ఐడీ కార్డు చూపినా.. ఏసీపీ గణేశ్ తనను కొట్టాడని ఆమె ఆరోపించింది. 

రూల్స్ ఏం చెబుతున్నాయి? 

అత్యవసర సేవలు అందించేవారికి మినహాయింపు ఉంటుందంటున్నాయి. లాక్‌డౌన్‌కు ఆధారంగా ఉన్న 1897నాటి అంటువ్యాధుల చట్టం ప్రకారం.. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవచ్చు. ఐపీసీ 188 ప్రకారం శిక్షలు కూడా వేయిచ్చు. ఈ చట్టాన్ని అమలు చేయడానికి స్వచ్ఛందగా ముందుకొచ్చేవారిపై చర్యలు ఉండవు అని ఆ చట్టంలో ఉంది. అంతేగానీ మన ఘనత వహించిన పోలీసుల్లా ప్రజలను లాఠీలతో కొట్టాలని, మన వాహనాలకు కిందపడేసి ధ్వంసం చెయ్యాలని ఎక్కడా లేదు. ఇలా చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే. పోలీసులు అలాంటి వారిపై కేసులు పెట్టడమో, జైళ్లకు పంపడమో చేస్తే ఏవరూ అభ్యంతరం చెప్పరు. అలా కాకుండా గొడ్లను బాదినట్లు బాదితే వారి ఏమని పిలవాలో వారే నిర్ణయించుకోవాలి. 

రూల్స్ తెలిసి కొందరు, సరిగ్గా తెలియక కొందరు, అత్యవసర పనులపై కొందరు రోడ్లపైకి వస్తుంటారు. పోలీసులు వారిని చూడగాన కొట్టకుండా విషయమేంటో కనుక్కోవాలి. వారి వాదన వినాలి. నిబంధనలు గురించి చెప్పాలి.   ఉద్దేశపూర్వకంగానే రోడ్లపైకి వచ్చి ఉంటే ఆమేరకు కేసు నమోదు చేసుకోవాలి. ఇకనైనా అలా చేస్తారని ఆశిద్దాం.