తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి జాక్ నాయకులు చాలా మంది ఇప్పుడు కన్పించడం లేదు. ముఖ్యులు కొందరు పదవులతో సరిపెట్టుకున్నారు. ఇంకొందరు కారులోఎక్కి కూర్చుకున్నారు. జాక్ నాయకత్వం వహించిన కోదండరాం మాత్రం రాస్తా వదలకుండా ఎవ్వరు వెంట వచ్చినా రాకున్నా సోలోగా సోషల్ మీడియాను పట్టుకుని సోలోగా ఉర్కతనే ఉన్నరు.
మూడేళ్ల కాలంలో తొలి యేడాది మినహాయిస్తే అడపాదడపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చిన జాక్ ఛైర్మన్ ఇప్పుడు యాత్రల పేరుతో తెలంగాణ చుట్టేస్తున్నారు. ఈయన వేస్తున్న ప్రతీ అడుగును అధికార పార్టీ పరిశీలనగా చూస్తున్నది. అయితే కోదండరాంతో ఇప్పటికిప్పుడు అధికార పార్టీకి వచ్చిన నష్టం లేదు. మరి ఇట్లాగే వదిలేస్తే కష్టం అనుకున్నట్లుంది టిఆర్ఎస్. అందుకే జిల్లా స్థాయి నాయకుల నుండి ఎంపిల వరకు అందరూ కోదండాన్ని ఏకి పారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని అంటున్నారు. విపక్షాల ఉచ్చులో పడ్డారని తేల్చేస్తున్నారు.
నెల రోజుల కాలంలో కోదండరాం యాక్టివిటీ బాగా పెరిగింది. ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయంపై ఏదో కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ఇంకా చెప్పాల్నంటే… ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు ఒక్కో సారి ఆయన స్టేట్ మెంట్లను చూస్తే అన్పిస్తున్నది. సిద్దిపేట, సిరిసిల్లలను టార్గెట్ చేసుకున్నట్లుంది కోదండం. అందుకే సిద్దిపేటలో సభ పెట్టారని కొందరు అంటున్నారు. ఆ సభకు జనాలు భారీగా వచ్చి కోదండరాం చెప్పిన మాటలు విన్నారు. అమరవీరుల స్పూర్తి యాత్ర సిరిసిల్ల సభకూ మంచి స్పందనే ఉంది. ఈ స్పందన ఫేస్ బుక్, యూట్యూబ్ లలో ఉంది. మెయిన్ స్ర్టీమ్ మీడియా కాస్త వెనుకా ముందు చూసుకుని కవరేజీ చేస్తున్నదని కోదండ అండ్ కో చెప్తున్న మాట. కవరేజీల కథ ఎట్లున్నా సరే ప్రభుత్వానికి కూడా ఎక్కడో ఒక దగ్గర చెక్ ఉండాలనే అభిప్రాయం కూడా తెలంగాణ జనాల్లో ఉంది.
యేడాది కిందటి వరకు ఎటూ అర్థం కాని పొలిటికల్ సైన్స్ అకడమిక్ లాంగ్వేజీలో స్పీచ్ లు ఇచ్చిన కోదండరాం… తన ఇంటి తలుపులు విరిగిన తర్వాత మాట సూటగా సుత్తి లేకండా పలుకుతున్నారనే వారూ ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. తాను సోలోగా వెళ్తున్నాని అనుకున్నా…. డోంట్ కేర్ అన్నట్లుంది కోదండరాం వ్యవహారం. అందుకే వెంట వచ్చిన వారిని పట్టుకుని యాత్రలు చేస్తున్నారు. ఇదిగో కోదండరాం ఇప్పటికీ ఉన్నారని జనాలు మర్చిపోకుండా చేస్తున్నారు.
ఎన్నికల నాటికి పొలిటికల్ పార్టీ పెడ్తానని కూడా చెప్పారు. కొన్ని సార్లు ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. మల్లన్న సాగర్ పై పెద్ద ఎత్తున ఉద్యమించారు.అంతట్లనే ప్రభుత్వం అడిగితే సలహా ఇస్తానని అన్నారు. జనాలను మూడ్ ను బట్టి కోదండరాం కార్యచరణ తీసుకుంటున్నట్లుంది. దీన్ని కాంగ్రెస్, బిజెపిల అడ్వాంటేజీగా తీసుకుంటాయా అంటే అదీ లేదు. పైగా కోదండరాం వెనక వెళ్లేందుకు రెఢీగా ఉన్నట్లూ కన్పించడం లేదు విపక్షాల వ్యవహార శైలీ. అందుకే కోదండమే బెటర్ ఆప్షన్ అని జనాలను భావించే పరిస్థితి ఉందనే అభిప్రాయమూ ఓ సెక్షన్ జనాల్లో ఉంది.
ఈ మధ్య లెఫ్ట్ పార్టీల పెడుతున్న సభలకూ వెళ్తున్నారు. ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని విమర్శలు చేస్తున్నారు. అయితే కోదండరాంకు మూడేండ్ల ముందు ఉన్నంత ఊపు లేదు. అయినప్పటికీ….. ఇప్పటికీ కోదండరాం ఉద్యమకారుడిగా జనం మాట్లాడుకునే టట్లు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.