Telangana Politics: Revanth Reddy Is Going To Do Padayatra In State
mictv telugu

తెలంగాణలో పాదయాత్రకు సిద్ధమైన మరో ప్రధాన పార్టీ?

November 27, 2022

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పాదయాత్రకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా రాష్ట్రంలోని అన్ని పార్టీలు పక్కా ప్లాన్లు వేస్తూ.. పాదయాత్రలతో జనాల్లోకి వెళుతున్నారు. ఆ యాత్రలతో తాము అధికారంలోకి వస్తామని ఇప్పటికే బీజేపీ, వైఎస్సాఆర్‌టీపీ లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే క్రమంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ పాదయాత్రకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

పాదయాత్రకు ముహూర్తం కూడా ఫిక్స్!

పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర చేయాలని తన సన్నిహితుల దగ్గర రేవంత్ వ్యాఖ్యానించినట్లు మీడియాలో కథనాలు వస్తోన్నాయి. రాష్ట్రంలో పార్టీ బలపడాలంటే పాదయాత్ర తప్ప వేరే మార్గం లేదని రేవంత్ భావిస్తున్నాడట. మరో ముఖ్య విషయం ఏంటంటే.. రేవంత్ పాదయాత్రకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9 నుంచి పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు వినికిడి. అయితే పాదయాత్రకు ఢిల్లీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా? అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.

అధికారం లేదు కానీ.. అభ్యర్థులు మాత్రం..

ఒకవేళ రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగతా నేతలు అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. సీనియర్లు మేం ఉండగా అతనికెందుకు ఆ అవకాశమంటూ.. పాదయాత్రలు చేయడానికి చాలా మంది నాయకులు రెడీ అవుతారు. కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా.. వస్తుందన్న ఆశ లేకపోయినా… ముఖ్యమంత్రి అభ్యర్థులు డజన్ల మంది ఉంటారు. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ లో ముఖ్య నాయకులందరినీ రేవంత్ రెడ్డి ఒప్పిస్తాడా.? పాదయాత్రకు రూట్ క్లియర్ చేస్తాడా? అనేది కూడా సందేహమే.

పాదయాత్రకు పైసలేవీ?

ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఢిల్లీలో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై చర్చించారు. పాదయాత్రపై కూడా చర్చించే ఉంటారని చెబుతున్నారు. కాగా పాదయాత్ర అంటే రాష్ట్రంలోని నేతలు హాడలిపోతున్నారట. ఇప్పటికే మునుగోడు బై పోల్ కు , భారత్ జోడో యాత్రకు ఖర్చు తడిసి మోపెడయిందని, ఇప్పుడు పాదయాత్ర అంటే మళ్ళీ డబ్బు ఎలా సమకూర్చాలనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. పాదయాత్ర అంటే రోజుకు కనీసం 25 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుందని..ఎక్కడి కక్కడ స్థానిక, జిల్లా నాయకులే భరించాల్సి ఉంటుందని అంటున్నారు. రేవంత్ యాత్ర పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తుందని భావిస్తున్నారు.