తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనపై యుద్ధం చేయడానికి సిద్దమైయ్యారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను ఖండిస్తూ, దేశవ్యాప్తంగా నిరసనలు చేయాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అసలు స్వరూపాన్ని నగ్నంగా నడిబజారులో నిలబెట్టాలని, పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకొని అన్ని రాష్ట్రాల విపక్షాలు యుద్ధం చేయాలని దేశంలోని పలు రాష్ట్రాల విపక్ష నేతలతో ఆయన శుక్రవారం ఫోన్లో చర్చించారు.
మొదటగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఆయన చర్చించారు. అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్‌లో ఆడీ నేత తేజస్వీ యాదవ్, యూపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోపాటు సహా ఇతర జాతీయ విపక్ష నేతలకు కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసిన సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. లోకసభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రస్తావించాల్సిన కీలక అంశాలు, కేంద్రాన్ని నిలదీసే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు టీఆర్ఎస్ ఎంపీలతో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో కేసీఆర్ సమావేశం కానున్నారు. ముఖ్యంగా తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న రాష్ట్ర వ్యతిరేక విధానాలను ఖండిస్తూ, పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసన తెలిపి, పార్లమెంటు వేదికగా పోరాడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.