పైసా ఇవ్వలేదు, మీతోనా బంగారు తెలంగాణ? బీజేపీపై బాల్క సుమన్ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

పైసా ఇవ్వలేదు, మీతోనా బంగారు తెలంగాణ? బీజేపీపై బాల్క సుమన్ ఫైర్

August 13, 2019

Telangana provocation of hate politics.

తెలంగాణలో విద్వేష రాజకీయాలను రెచ్చగొట్టి.. నెత్తుటేర్లు  పారించడమే బీజేపీ లక్ష్యం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం రాష్ట్ర బీజేపీ కమిటీకి ఈమేరకు  బహిరంగ లేఖ రాసిన ఆయన.. తెలంగాణపై బీజేపీ వైఖరిని దుయ్యబట్టారు. విద్వేష రాజకీయాలతో రక్తపుటేరులు పారించడం బీజేపీ లక్ష్యమైతే.. నీళ్లు పారించి అభివృద్ధి చేయడం టీఆర్ఎస్ ధ్యేయం అని స్పష్టంచేశారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 

లక్ష్మణ్ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్రం కనీసం పరిశీలించిన పాపాన పోలేదు. విభజన హామీలు అమలు చేయాలని, బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏనాడైనా కేంద్రాన్ని అడిగిందా? రాష్ట్ర అభివృద్ధికి చిల్లిగవ్వ కూడా ఇవ్వని బీజేపీతో బంగారు తెలంగాణ సాధ్యమేనా? తెలంగాణ ఏర్పాటుపైనే విషం కక్కిన బీజేపీతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమేనా? లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదించే సమయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది వాస్తవం కాదా? రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోగా.. ఆ పార్టీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అడుగడుగునా తెలంగాణపై విషం చిమ్ముతున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్మడాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. తెలంగాణ విషయంలో బీజేపీ ఏనాడూ స్పష్టమైన వైఖరిని, చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు’ అని బాల్క సుమన్ ఫైరయ్యారు.