కరోనా వైరస్ ఇంకా మనతో పాటే ఉందని , పూర్తిగా నిర్మూలన అయ్యేందుకు ఇంకాస్త సమయం పడుతుందన్నారు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు. పాండమిక్‌గా మొదలైన ఈ మహమ్మారి.. ప్రస్తుతం ఎండమిక్ స్టేజిలో కొనసాగుతోందన్నారు. అయితే ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత వారం రోజుల్లో దాదాపు 56శాతం పైగా కేసులు పెరిగాయని చెప్పారు. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ కేసులు భారీగా వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టి.. మళ్లీ గత రెండు వారాలుగా కొత్త కేసుల పెరుగుదలను చూస్తున్నామన్నారు. గత మూడు రోజుల నుంచి 100కు పైగా కేసులు వస్తున్నాయని డీహెచ్ వివరించారు.
ప్రస్తుత కేసులు పెరగడాన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏకైక అస్త్రంగా ఉన్న మాస్క్‌ను పెట్టుకోవాలని ఆయన తెలిపారు. ఈ వర్షా కాలం ఫ్లూ సీజన్ గనక ఆ లక్షణాల నుంచి కొవిడ్‌ను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్వరలోనే పాఠశాలలు తెరుచుకోనుండటంతో పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలందరికీ టీకాలు వేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని డీహెచ్ సూచించారు.