తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) వెబ్ సైట్ హ్యాక్ అయినట్టు అధికారులు గుర్తించారు. దాంతో, రెండు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష, ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్ లైన్ లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష జరగాల్సి ఉంది. వీటిని వాయిదా వేస్తున్నట్టు కమిషన్ తెలిపింది. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. కమిషన్ వెబ్ సైట్ హ్యాక్ అయినట్టుగా అనుమానాలున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.
టౌన్ ప్లానింగ్ పోస్టులకు నేడు ఓఎంఆర్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు ముద్రించి, పరీక్ష కేంద్రాలకు పంపిణీ చేసింది. పరీక్షకు ఒకరోజు ముందు టీఎస్‌పీఎస్సీ నుంచి సమాచారం హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆ విషయంపై అత్యవసర సమావేశం నిర్వహించిన కమిషన్.. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించింది. కంప్యూటర్ల నుంచి పరీక్షకు సంబంధించిన సాఫ్ట్కాపీ సమాచారం హ్యాకింగ్‌కు గురైందని, ప్రశ్నల వివరాలు బయట ప్రచారం కాలేదని తెలిపింది.
వాస్తవానికి టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నుంచి అత్యంత రహస్య సమాచారం లీకైందన్న విషయాన్ని ఓ యువకుడు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చినట్లు తెలిసింది. పోలీసులు కమిషన్ కార్యాలయానికి వెళ్లి కంప్యూటర్లు హ్యాకింగ్ అయినట్లు సమాచారం ఉందని లాగిన్ వివరాలు చూసుకోవాలని సూచించారు. కమిషన్ అధికారులు పరిశీలించి అత్యంత రహస్య సమాచారం ఉన్న కంప్యూటర్లను ఇతరులు తెరిచినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో టీఎస్పీఎస్సీ అధికారులు బేగంబజార్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంతో రహస్యంగా ఉన్న సమాచారం లీకైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.