నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన వైద్య విద్యార్ధిని ధరావత్ ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ తమిళిసై వెళ్లారు. ఈ సందర్భంగా పూలదండతో వెళ్లారని విమర్శలు వచ్చాయి. ప్రీతి సోదరి కూడా గవర్నర్ పూలదండ తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మా సోదరి చనిపోయిందనుకొని పూల దండ తెచ్చారా? జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ వేయాల్సిన మీరు ఇలా వ్యవహరించడం న్యాయమా? అని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఈ అంశంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ రాజ్ భవన్ క్లారిటీ ఇచ్చింది.
‘గవర్నర్ వేరే ప్రాంతాల నుంచి రాజ్‌భవన్‌కి తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాదులోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా గవర్నర్ అలాగే చేశారు. కానీ కొందరు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రీతి త్వరగా కోలుకోవాలని హనుమంతుడిని గవర్నర్ ప్రార్ధించారు. గవర్నర్ నిమ్స్ పర్యటనను సదుద్ధేశంతో అర్ధం చేసుకోవాలి. ఘటనపై ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సమగ్రంగా దర్యాప్తు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు’ అని ఓ ప్రకటనలో వెల్లడించింది.