పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిని కాపాడేందుకు మొదట ఆమె ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు సమాచారం ఇచ్చారని కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాళోజీ విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాజ్‌భవన్ లేఖ రాసింది. గవర్నర్ తమిళిసై ఆదేశాల మేరకు ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని పేర్కొంది.
ర్యాగింగ్, వేధింపుల తరహా ఘటనలు జరిగినపుడు తీసుకునే చర్యలకు సంబంధించిన ఎస్‌ఓపీలపై సమగ్ర నివేదిక అందించాలని రాజ్‌భవన్ కోరింది. మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనిగంటలు.. వైద్యకళాశాలలు, ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరుపైనా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, వారి కోసం కౌన్సెలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్లో ఉదాసీనంగా వ్యవహరించకుండా తక్షణం స్పందించి కఠినచర్యలు తీసుకోవాలన్నారు. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబంధించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై సరైన శ్రద్ధ పెట్టాలన్నారు.