Telangana ranks first in national crime report
mictv telugu

నేరాల్లో తెలంగాణకు మొదటి స్థానం.. క్రైమ్ రిపోర్టు వెల్లడి

August 29, 2022

అభివృద్ధి, తలసరి ఆదాయం, పట్టణీకరణలో దూసుకుపోతున్న తెలంగాణలో క్రైమ్ రేటు కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇక సైబర్ నేరాల్లో అయితే తెలంగాణ ఏకంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ 2021 రిపోర్టును వెల్లడించింది. దీని ప్రకారం మానవ అక్రమ రవాణా, కల్తీ ఆహారం కేసుల్లోనూ తెలంగాణ టాప్ ప్లేసులో ఉంది. వృద్ధులపై దాడుల్లో మూడు, అన్నదాతల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో నిలిచింది. సైబర్ నేరాల విషయానికి వస్తే 2019లో 2691 కేసులు నమోదవ్వగా, 2020లో 5024, 2021లో 200 శాతం పెరిగి 10,303కి చేరాయి. దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణలో నమోదయ్యే కేసులు 20 శాతంగా ఉన్నాయి. తర్వాత ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఆర్ధిక నేరాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో 2019లో 11,465, 2020లో 12,985 కేసులు నమోదైతే 2021లో 20,759 కేసులు వచ్చాయి. ఏటీఎం, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఓటీపీ, మార్ఫింగ్ మోసాలు, ఫేక్ ప్రొఫైల్ తయారీ వంటివి తెలంగాణలో అధికమని రిపోర్టు వెల్లడించింది.