Telangana: Record Breaking Liquor Sales On December 31, 2022
mictv telugu

రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు

January 2, 2023

Telangana: Record Breaking Liquor Sales On December 31, 2022

న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మందుబాబులు మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. గత ఆరు రోజుల్లో రికార్డ్ స్థాయిలో రూ.11 వందల కోట్లకుపైగా మద్యం అమ్ముడైంది. డిసెంబర్‌ నెలలో ఏకంగా రూ.3,376 కోట్లు విలువైన మద్యాన్ని తాగేశారు. డిసెంబరు 26వ తేదీ నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు ఏకంగా రూ.1111.29 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.70 నుంచి రూ.80 కోట్ల విలువ గల మద్యం మాత్రమే అమ్ముడవుతుండగా.. ఈ నెల చివరి వారంలో ఏకంగా రోజుకు రూ.185 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది.

గత ఏడాది కన్నా ఎక్కువే..
2021 డిసెంబరు 31వ తేదీన కేవలం రూ.171.93 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోగా.. 2022 డిసెంబరు 31న రూ.216 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇక డిసెంబరు చివరి వారంలో చోటుచేసుకున్న మద్యం విక్రయాలను పరిశీలించినట్లయితే 26వ తేదీన రూ.182.28 కోట్లు, 27వ తేదీన రూ.155.29 కోట్లు, 28వ తేదీన రూ.144.79 కోట్లు, 29వ తేదీన రూ.159.14 కోట్లు, 30వ తేదీన శుక్రవారం ఒక్క రోజునే అత్యధికంగా రూ.254 కోట్లు విలువైన మద్యం అమ్మకం జరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.34,352.75 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 2021లో మొత్తం రూ.18,868 కోట్ల అమ్మకాలు జరిగితే.. 2020లో మొత్తం కలిపి రూ.16,254 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.