కరోనా మళ్లీ పుంజుకుంటోందా?: ఈరోజు 62 కేసులు నమోదు, ముగ్గురు మృతి
ఓవైపు లాక్‌డౌన్ సడలింపులతో నెమ్మదిగా ఒక్కొక్కటి తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా మళ్లీ పుంజుకుంటోందా? తగ్గుతుంది అనుకుంటున్న కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. నిన్న తెలంగాణలో 38 కేసులు నమోదవగా, 5గురు మృతిచెందారు. ఈరోజు మళ్లీ అందుకు రెట్టింపుగా రాష్ట్రంలో కేసులు నమోదవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 62 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎమ్‌సీ పరిధిలో 42, రంగారెడ్డిలో 1, వలస కార్మికుల్లో 19 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నేడు కరోనాతో ముగ్గురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 48కి చేరింది. ఏడుగురు డిశ్చార్జ్ అవగా, 670 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,761 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వారిలో 1,043 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. వలస కార్మికల్లో ఇప్పటివరకు 118 మందికి కరోనా సోకిందని అన్నారు. కాగా, లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కరోనా కేసులు జిల్లాలకు కూడా వ్యాపించవచ్చని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షం రోజుల్లో తెలంగాణ జిల్లాల్లో కేసులు పెరగొచ్చని అంటున్నారు.