Telangana: Red alert for 11 districts..three more days
mictv telugu

బ్రేకింగ్: తెలంగాణలో 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్..మరో మూడు రోజులు

July 13, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు కాసేపటిక్రితమే ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు, ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌‌ను జారీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను ఉన్నతాధికారులు వాయిదా వేయగా, తెలంగాణలో విద్యా సంస్థల సెలవులను పొడిగించే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.

విడుదల చేసిన ప్రకటనలో..”అసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, మహబూబాబాద్‌, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఇప్పటికే గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. ఊరూ, వాడా, వాగూ, వంకాలు ఏరులై పారుతున్నాయి.

మరోపక్క నదులు పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుల వరద ఉదృతి ఎక్కువగా కావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేకచోట్ల జనజీవనం స్తంభించింది. కొన్నిచోట్ల అలుగు దుంకుతున్న చెరువులతో అందాలు జాలువారుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో కట్టలు తెగి ఊళ్లను, చేలను ముంచెత్తుతున్నాయి. మంగళవారం నాటికి రాష్ట్రంలో 49 చెరువులు పూర్తిగా తెగిపోయాయి. మరో 43 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు తెలిపారు.