తెలంగాణ: 1 నుంచి కొత్త ఓటర్ల నమోదు షురూ
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలౌతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లోని సీఈవో కార్యాలయం నుంచి ఆయన మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ కార్డ్, ఆధార్డ్ కార్డులకు సంబంధించిన విషయాలపై చర్చలు జరిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.."ఆగస్ట్ 1 నుంచి ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం చేయాలి. ఎందుకంటే ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం అనేది ఐచ్ఛికం. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, ఓటర్ల ఆధార్ వివరాలు వెల్లడి కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాదు, ఆగస్టు 1 నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా షురూ చేయండి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫొటో సారూప్యత ఉన్న 10,25,987 డబుల్ ఎంట్రీలను తొలగించాం. ఈ కొత్త ఓటర్ల నమెదు ప్రక్రియ, ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం చేసే కార్యక్రమానికి కలెక్టర్లే బాధ్యత వహించాలి" అని ఆయన అన్నారు.