శ్రీలంకలో డబ్బులు పంచిన తెలంగాణ వాసి.. అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీలంకలో డబ్బులు పంచిన తెలంగాణ వాసి.. అరెస్ట్

June 15, 2022

తీవ్ర ఆహార, ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక దేశంలో ప్రజలకు డబ్బులు పంచుతున్న తెలంగాణ వాసిని ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతను చెప్పిన సమాధానం విని విచారించి వదిలేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి ఇటీవల శ్రీలంకకు వెళ్లి మానవతా దృక్పథంతో అక్కడి జనాలకు డబ్బులు పంచారు. మన కరెన్సీని శ్రీలంక కరెన్సీలోకి మార్చి రూ. 500, రూ. 1000 నోట్లను రోడ్డుపై పంచుతుండగా, పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి దాదాపు రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతను చెప్పిన కారణం చూసి వదిలేశారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను ప్రతీనెలా శ్రీలంక వెళ్తాను. నెలలో 9 నుంచి 21 రోజుల పాటు ఆ దేశంలో ఉంటాను. గతంలో గొటాబయకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. వారి పరిస్థితి చూసి జాలి వేసి మన కరెన్సీని వారి కరెన్సీలోకి మార్చి డబ్బు సాయం చేస్తున్నాను. దాంతో పోలీసులకు అనుమానం వచ్చి అరెస్ట్ చేశారు. కానీ, పై వివరాలు చెప్పడంతో వదిలేశారు’ అని వివరించారు.