ఆర్ధరాత్రి నుంచి బాదుడు.. కనీస చార్జి రూ.10..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్ధరాత్రి నుంచి బాదుడు.. కనీస చార్జి రూ.10.. 

December 2, 2019

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు చార్జీల వాతలు పడనున్నాయి. సంస్థను నిలబెట్టడానికి చార్జీలను కి.మీ.కి 20 పైసల చొప్పున పెంచుకునే అధికారాన్ని ఆర్టీసీకి ఇస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. అనుమతి రావడమే ఆలస్యం అన్నట్టు యాజమాన్యం చార్జీల పెంపును ఖరారు చేసింది. నేటి(సోమవారం) అర్థరాత్రి నుంచి పెంపు అమల్లోకి రానుంది. పెంపుతోపాటు టోల్ ప్లాజా, జీఎస్టీ, ప్యాసింజర్ సెస్‌ను యథావిధిగా వసూలు చేస్తారు. పల్లెజనం, బీదాబిక్కీ తిరిగే పల్లెవెలుగు కనీస చార్జీని రూ. 5 నుంచి రూ. 10కి పెంచారు. నిన్న ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో సిటీల్లో కనీస చార్జీ రూ.8 ఉండడం వల్ల చిల్లర సమస్య తలెత్తుతున్నదని కార్మికులు చెప్పగా రూ.10 చేయండని సీఎం అన్నారు. బస్సు పాసులు కూడా భారం కానున్నాయి. 

Telangana rtc.

కనీస చార్జీలపై పెంపు.. 

 పల్లె వెలుగు రూ.5 నుంచి రూ.10

 సెమీ ఎక్స్‌ప్రెస్‌ రూ.10

ఎక్స్‌ప్రెస్‌ రూ.10 నుంచి రూ.15

 డీలక్స్‌  రూ.15 నుంచి రూ.20

 సూపర్‌ లగ్జరీ  రూ.25

 రాజధాని, వజ్ర  రూ.35

 గరుడ ఏసీ రూ.35

 గరుడ ప్లస్ ఏసీ రూ.35

 వెన్నెల ఏసీ స్లీపర్ రూ.70

కాగా, ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ బస్సులో ఒక కిలోమీటరుకు  87 పైసలు, డీలక్స్‌కు 98 పైసలు, సూపర్‌ లగ్జరీకి 1.16 పైసలు, రాజధానికి 1.46 పైసలు, గరుడకు 1.71 పైసలు, గరుడ ప్లస్‌కు 1.82 పైసలు, వెన్నెలకు 2.53 పైసల చొప్పున బేసిక్ చార్జీలున్నాయి. వీటిపై కి.మీ.కి 20 పైసలు కలుపుతారు.

 

 బస్‌పాసులు ఇలా 

సిటీ ఆర్డీనరీ పాస్‌ ఛార్జీ రూ.770 నుంచి రూ.950కి పెంపు.

మెట్రోపాస్‌ ఛార్జీ రూ 880 నుంచి రూ.1070కి పెంపు.

మెట్రో డీలక్స్‌ పాస్‌ ఛార్జీ రూ.990 నుంచి రూ.1180కి పెంపు.

స్టూడెంట్‌ బస్‌పాస్‌ రూ.130 నుంచి రూ.165 కి పెంపు.