డ్యూటీలో చేరుతున్న కార్మికులు..కళకళలాడుతున్న డిపోలు - MicTv.in - Telugu News
mictv telugu

డ్యూటీలో చేరుతున్న కార్మికులు..కళకళలాడుతున్న డిపోలు

November 29, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెరపడింది. డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు 55 రోజుల తర్వాత ఈరోజు డ్యూటీలో చేరుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా వారిని విధుల్లో చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్ నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే కార్మికులు డిపోల వద్దకు చేరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల పరిధిలో కార్మికులంతా విధులకు తరలివస్తున్నారు. దీంతో ఆర్టీసీ డిపోల వద్ద సందడి నెలకొంది. ఇన్నాళ్లు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడ్డ జనం కూడా.. ఆర్టీసీ కార్మికుల చేరికతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telangana rtc employees.

సమ్మెలో పాల్గొన్న కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం కాపాడుకుటోందని ఆయన ప్రకటించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీకి వంద కోట్ల రూపాయల తక్షణ సాయం కూడా ప్రకటించారు. డిపోకి ఇద్దరు కార్మికులతో ఆర్టీసీ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామన్నారు. యూనియన్లకు బదులు కౌన్సిల్‌తోనే ఇకపై ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్నారు. త్వరలోనే ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు.. నలుగురైదుగురు కార్మికులు కలిసి ఒక బస్సు తీసుకుంటే ప్రభుత్వమే లోన్ ఇప్పించి ప్రైవేట్ పర్మిట్ ఇచ్చే ఆలోచన కూడా ఉందన్నారు.