రణరంగంగా ట్యాంక్ బండ్..170 మంది అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

రణరంగంగా ట్యాంక్ బండ్..170 మంది అరెస్ట్

November 9, 2019

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 36వ రోజుకి చేరింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తల పెట్టిన ‘చలో ట్యాంక్ బండ్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని దాడుకొని ఆర్టీసీ కార్మికులు దూసుకొస్తున్నారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చలో ట్యాంక్ బండ్‌లో పాల్గొన్నారు. మహిళా కార్మికులు సైతం ఆందోళనలో పాల్గొనడం గమనార్హం. మహిళా కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 20 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషామహల్ స్టేషన్‌కు తరలించారు. చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్ చేశామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. 

Telangana rtc employees.

ఆర్టీసీ జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ముందస్తు అరెస్టులు చేసినట్టు వెల్లడించారు. అలాగే చలో ట్యాంక్‌బండ్‌ ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హిమాయత్ నగర్ లిబర్టీ వద్ద నుంచి వెళ్తున్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. పొన్నం ప్రభాకర్, గీతారెడ్డి, షబ్బీర్ అలీలను హైదరాబాద్‌లో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పొన్నాల లక్ష్మయ్యను హన్మకొండలో హౌజ్ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌ ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సామాన్యులను పోలీసులు అనుమతించకపోవడంతో ఉద్యోగాలకు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు మూసివేసి, ట్రాఫిక్‌ మళ్లించడంతో కష్టాలు పడుతున్నామని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.