బలిదానాలు వద్దు.. బలంగా కొట్లాడండి..  - MicTv.in - Telugu News
mictv telugu

బలిదానాలు వద్దు.. బలంగా కొట్లాడండి.. 

October 12, 2019

telangana rtc strike

అతనికి నడుం వంగిపోయింది. ఖళ్లుఖళ్లున దగ్గుతున్నాడు. అయినా రోజూ ఓపికగా బావిలోంచి నీరు తోడు మామిడి మొక్కకు పోస్తున్నాడు. మనవడికి అదంతా వెర్రిపనిగా అనిపించింది. ‘తాతా..! కాటికి కాళ్లు చాపుకున్నావు. ఆ మామిడి మొక్క పెరిగేదెప్పుడు? పెద్దయ్యేదెప్పుడు? పూతపూసి కాయలు కాసేదెప్పుడు? అప్పటికి నువ్వు బతికుంటావా? నీదంతా అత్యాశ కాకపోతే’ అని వెటకరించాడు. తాత ఏమాత్రం నొచ్చుకోలేదు. మనవడి భుజమ్మీద చెయ్యేశాడు. ప్రేమగా తడుతూ.. ‘నాకు దాని పళ్లు తినాలనే ఆశేమీ లేదరా  అబ్బాయ్! నేను కాకపోతే నీ తండ్రి తింటాడు. అతడు కాకపోతే నువ్వు తింటావు. నువ్వు కాకపోతే నీ కొడుకు తింటాడు.. నేను కాకపోయినా ఎవరో ఒకరు తినాలనే దీనికి నీళ్లు పోస్తున్నా.. మన పని మనం చెయ్యాలి.. ఫలితం తర్వాత..’ అన్నాడు.

చరిత్ర ఏం చెబుతోంది? 

చాలామందికి తెలిసిన కథే ఇది. మానవుడి సంకల్పానికి, దార్శనికతకు ఇది నిదర్శనం. జీవితంలో ఎన్నిఆటుపోట్లు వచ్చినా, కొండలు విరిగి మీదపడినా, సముద్రాలు ఉప్పొంగి ముంచేసినా.. మనిషి యుగయుగాల నుంచి తనను ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ వస్తున్నాడు. సామాన్యుడు రాజుపై తిరగబడ్డాడు. రైతుకూలి భూస్వామిపై తిరగబడ్డాడు. కార్మికుడు యజమానిపై తిరగబడ్డాడు. ఉద్యోగి ప్రభుత్వాన్ని ధిక్కరించాడు.. అందరూ తమకు దక్కాల్సిన న్యాయం కోసం పోరాడుతూ సాగుతున్నారు. కొందరు నిరుత్సాహపడి, నీరుగారిపోయినా పోరాటాలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. మనిషి జీవితంలో మార్పు కోసం లాఠీలను, తుపాకులను ఎదుర్కొంటూ సాగుతున్నాడు. సమ్మెలు, ధర్నాలు, ఘెరావ్‌లు, హర్తాళ్లు, ఆందోళనలు, తిరుగుబాట్లు చరిత్రగతిని మార్చాయి. మారుస్తున్నాయి. మారుస్తాయి.

తెలంగాణలో…

ఏడు రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా అలాంటిదే. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు రాజ్యాంగ పరిధిలో శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. ఎక్కడా ఎవరూ హింసకు దిగలేదు. ప్రభుత్వం సమ్మెను ఎదుర్కోడానికి యత్నిస్తోంది. తిప్పికొట్టడానికి ప్రత్యామ్నాయాలు చూస్తోంది. తెలంగాణ సాధన కోసం ఆనాడు జరిగిన సకల జనుల సమ్మె వాతావరణం ఇప్పుడూ కనిపిస్తోంది. అసలు తెలంగాణ చరిత్రే ఉద్యమాల చరిత్ర కదా. కొమురంభీం పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొన్నటి మలిదశ తెలంగాణ పోరాటం వరకు ఈ గడ్డపై ధిక్కార బావుటా ఎగురుతూనే ఉంది. 

చేతులు కలపాలి.. 

ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి పోతే కష్టాలు పోవు. మనిషి చుట్టూ మమతలు అల్లుకుని ఉంటాయి. భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు మరిన్ని కష్టాల్లో పడతారు. నిజానికి ఆత్మ అంటూ ఒకటి ఉంటే మనిషి పోయిన తర్వాత అయినవాళ్ల కష్టాలు చూసి మళ్లీ బతకాలని, వారి కన్నీళ్లు తుడవాలని ఆరాటపడుతుంది. దైనందిన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి, పోతుంటాయి. యజమానులు, అధికారులు, ప్రభుత్వాలు, ఇరుగుపొరుగువాళ్లు, బంధుమిత్రులు, అపరిచితులు.. ఎవరో ఒకరి నుంచి ప్రతి ఒక్కరూ ఏవో సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. ఆర్థిక కష్టాలు, అరకొర జీతాలు ఎప్పుడూ ఉండేవే. వీటన్నింటిని అధిగమిస్తూనే మానవాళి ముందుకు సాగుతోంది. తాత్కాలిక సమస్యలకు ఆత్మహత్య ఎప్పుడూ పరిష్కారం కానే కాదు. న్యాయమైన ఉద్యమం ఎప్పుడూ ఒంటరిది కాదు. తోటి ఉద్యమకారులకు అండగా నిలవని ఉద్యమకారుడు అసలు ఉద్యమకారుడు కానే కాదు. ఇది కేవలం ఒక్క ఆర్టీసీ కార్మికుల సమస్యే కాదు. ఆర్టీసీ బస్సుతో ముడిపడిన కోట్లాది మంది సమస్య. ప్రైవేటు బస్సుల దోపిడీతో ప్రజలు ఇప్పటికే విసుగెత్తి ఉన్నారు. ఆ బస్సుల ఉద్దేశం లాభాలే తప్ప ప్రజాప్రయోజనాలు కానే కాదు. ప్రజల నిత్యావసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపైనే ఉంటుంది తప్ప, లాభాల కోసం అడ్డదారులు తొక్కే ప్రైవేటు దుకాణాలపై ఉండదు. 

ప్రజల చెంతకు.. 

ఉద్యమాలను పక్కదారి పట్టించే శక్తులు ఎప్పుడూ ఉంటాయి. బెదిరింపులు, హెచ్చరికలు, దుష్ప్రచారాలు సరేసరి. ఉద్యమకారులు తమ డిమాండ్లను మరింత బలంగా వినిపిస్తుండాలి. అవి న్యాయమైనవేనని ప్రజలకు వివరించాలి. ఆర్టీసీ స్థితిగతులను కళ్లకు కట్టాలి ఆర్టీసీ బస్సుపై ప్రేమ ఉన్న సామాన్యుడు దాన్ని కాపాడుకుని తీరతాడు. ఉద్యమం ఉధృతం అవుతుంది. అందరూ అలయ్ బలయ్ అంటారు. కష్టకాలంలో మరింత కష్టంగా మారిన ఈ కాలంలో చేదోడు వాదోడుగా తోడొస్తారు. అప్పుడు నిరాశానిస్పృహలకు చోటు ఉండదు. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. పిడికిళ్లు మరింత గట్టిగా బిగుసుకుంటాయి. కిరోసిన్ డబ్బాలు, ఉరికొయ్యలు చరిత్రకు మాత్రమే పరిమితం అవుతాయి.