ఆర్టీసీ చర్చలు విఫలం.. సమ్మె కొనసాగుతుందన్న జేఏసీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ చర్చలు విఫలం.. సమ్మె కొనసాగుతుందన్న జేఏసీ

October 26, 2019

Telangana rtc strike 

21 డిమాండ్లపైనే అంటూ ప్రభుత్వం, కాదు మొత్తం 46 డిమాండ్లపైనా చర్చించాలని కార్మికులు భీష్మించడంతో ఆర్టీసీ చర్చలు మళ్లీ విఫలమయ్యాయి. 22 రోజుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ రోజు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్థికేతర డిమాండ్లపైనే ప్రధానంగా చర్చిస్తామంటూ ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ మొత్తం 46 డిమాండ్లపైనా చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ నేతలు తేల్చిచెప్పారు. దీంతో గంటన్నరసేపు సాగిన చర్చలు ఫలితం తేలకుండానే ముగిశాయి. సమ్మె యథాతథంగా సాగుతుందని కార్మిక నేతలు స్పష్టం చేశారు. 

హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ ఈ జర్చలు జరిపింది. తమ నివేదికలో పేర్కొన్న 21 డిమాండ్లపై చర్చిస్తామని వారు చెప్పారు. అయితే మజ్దూర్ యూనియన్ ఇచ్చిన46 డిమాండ్లపైగానీ, లేకపోతే జేఏసీ ఇచ్చిన 26 డిమాండ్లపైగానీ  చర్చలు జరపాలని కార్మిక నేతలు పట్టుబడ్డారు. అందుకు కమిటీ ససేమిరా అనడంతో చర్చలు విఫలయ్యాయి. చర్చల్లో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. తమ తరఫున 8 మందిని కాకుండా తనతో సహా కేవలం నలుగురినే చర్చలకు అనుమతించారని, తమ సెల్ ఫోన్లు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఇలా నిర్బంధ వాతావరణంలో చర్చలు సాధ్యం కావని అన్నారు. ‘అవి అసలు చర్చలే కావు. మమ్మల్ని భయపెట్టారు. శత్రువులతో మాట్లాడినట్లు మాట్లాడారు…’ అని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశం ప్రకారం 26 డిమాండ్లపై చర్చించాల్సి ఉండగా, ప్రభుత్వం అందుకు ఒప్పుకోకపోవడం సరికాదని అన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ తరఫున నివేదిక ఇచ్చిన వారు చర్చల్లో పాల్గొనడం లేదని, ఆర్టీసీపై అవగామన లేని ఐఏఎస్‌లతో చర్చలు ఎలా ఫలప్రదం అవుతాయని ప్రశ్నించారు.