ఆర్టీసీ చర్చలు షురూ.. జేఏసీ నేతల అసంతృప్తి - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ చర్చలు షురూ.. జేఏసీ నేతల అసంతృప్తి

October 26, 2019

Telangana rtc strike and talks 

తెలంగాణ హైకోర్టు ఆదేశంతో ఎట్టకేలకు చర్చలు ప్రారంభమయ్యాయి.  ఆర్టీసీ జేఏసీ నేతలతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో చర్చలు ప్రారంభించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదన సహ 26 డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె చేస్తుండడం, వారితో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. గత శనివారమే కార్మికులను చర్చలకు పిలవాల్సిన ప్రభుత్వం వారం తర్వాత ఎట్టకేలకు చర్చలు ప్రారంభించింది. కేవలం ఆర్థికేతర డిమాండ్లపైనే చర్చిస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

కాగా, చర్చలకు నలుగురి కంటే ఎక్కువ మందిని లోపలికి పోలీసులు అనుమతించకపోవడంపై వివాదం నెలకొంది. దీనిపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను చర్చలకు పిలిచి ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్ ఫోన్లను అనుమతించడం లేదని, మొత్తం చర్చలను వీడియో రికార్డింగ్ చేస్తున్నారని, ఇదేమన్నా రహస్య వ్యవహారమా అని మండిపడుతున్నారు. చర్చలకు అశ్వత్థామ రెడ్డితోపాటు రాజిరెడ్డి, వీఎస్ రావు, వాసుదేవరావులను అనుమతించారు. ఆర్టీసీ స్థితిగతులపై ఈడీ కమిటీ నివేదికలోని 21 డిమాండ్లతోపాటు మొత్తం 46 డిమాండ్లపై చర్చలు జరపాల్సిందేనని జేఏసీ నేతలు పట్టుబడుతున్నారు. తక్షణ పరిష్కారాలు, దీర్ఘకాలిక పరిష్కారాల కింద కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.