అంతా మీ ఇష్టమేనా? ఇప్పుడే చేర్చుకోం, డిపోలకు రాకండి.. సమ్మె వివరణపై ఆర్టీసీ  - MicTv.in - Telugu News
mictv telugu

అంతా మీ ఇష్టమేనా? ఇప్పుడే చేర్చుకోం, డిపోలకు రాకండి.. సమ్మె వివరణపై ఆర్టీసీ 

November 25, 2019

Telangana Rtc strike management reaction.

సమ్మెను విరమించి రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక నాయకులు చేసిన ప్రకటనపై ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. సమ్మె చేయడం, మానడం అంతా మీ ఇష్టమేనా అని మండిపడింది. ఇప్పుడే వారిని చేర్చుకోబోమని, కార్మిక కోర్టు నిర్ణయం వరకు వేచి చూస్తామని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఓ ప్రకటన జారీ చేశారు. 

‘రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఎసి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారు. ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఉండదు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదు…’ అని శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలప్పుడు అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని ధ్వజమెత్తారు. విధులు ఎగ్గొట్టి, ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు  కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారని, దాని ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ‘అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుంది.  అప్పటి వరకు అందరూ సంయమనంగా ఉండండి. అప్పటివరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు..’ అని వివరించారు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారని, మళ్లీ వాటి మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని సూచించారు. ‘రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించకండి,  బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను  అడ్డుకోకండి.. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తాం. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం క్షమించదు. చట్ట పరమైన చర్యలు, క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే విషయాన్ని హైకోర్టుకు చెబుతాం..’ అని వివరించారు.