ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఇంకా రాముడి కాలం నాటి ఆలోచనలు ప్రజల్లో పోలేదు. ఆనాడు రాముడు సీతను అనుమానిస్తే సీత తన శీలపరీక్ష కోసం అగ్నిప్రవేశం చేసింది. ఈ కలియుగంలో తాను ఏ తప్పుచేయలేదని చెప్పినా కూడా ఊరి పెద్దలు ఓ పురుషుడికి శీలపరీక్ష కోసం అగ్నిపరీక్ష నిర్వహించారు. ఈ ఘటన మరెక్కడో కాదు తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఎర్రగా కాలిన బొగ్గుల నుంచి గడ్డపారను తీసి తాను శీలవతుడనని నిరూపించుకోవాలని గ్రామ పెద్దలు ఆదేశించారు . ఈ పరీక్షకు ఒప్పుకున్న సదరు వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కాలం మారుతున్నా ఇంకా మారుమూల పల్లెల్లో మూఢనమ్మకాలు పోలేదు అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ములుగు జిల్లా, ములుగు మండలం జంగాలపల్లి సమీపంలోని బంజర్ పల్లి గ్రామానికి చెందిన జగన్నాథం గంగాధర్ అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పెద్దమనుషుల పంచాయితీ పెట్టించాడు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. అయితే తనకు ఆమె ఎలాంటి సంబంధం లేదని గంగాధర్ నెత్తినోరూ బాదుకున్నా గ్రామ పెద్దలు వినలేదు. నీకు ఎలాంటి సంబంధం లేకపోతే శీలపరీక్షకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. దీంతో సదరు వ్యక్తం చేసేదేమీ లేక చివరకు అంగీకరించాడు. అయితే అగ్ని పరీక్షలో ఈ కలియుగ రాముడు నెగ్గినా నీవు తప్పుచేశావంటూ నిందించారు. దీంతో ఆగ్రహించిన గంగాధర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఈ వార్త ఆ నోట ఈ నోట పడి నెట్టింట్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫిబ్రవరి 25న ఈ సంఘటన చోటుచేసుకుంది. పెద్దమనుషులు చెప్పినట్లు గంగాధర్ సరస్సులో స్నానం చేసి అగ్ని గుండం చుట్టూ 3 సార్లు తిరిగి నిప్పుల్లో ఉన్న గడ్డపారను తీశాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ పరీక్షలో గాయాలైతే తప్పుచేసినట్లు కాకపోతే చేయనట్లు అని పంచాయితీ తీర్మానించింది. మరో విషయం ఏమిటంటే ఈ పరీక్షలో నెగ్గిన వారికి ఓడినవారు డబ్బులు చెల్లించారు.దీంతో గంగాధర్ తనకు డబ్బులు ఇప్పించాలని కోరగా సదరు పంచాయితీ పెద్దలు గాయాలు అయ్యాయని తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుకులు కేసు నమెదు చేసి విచారణ చేప్టారు.