గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈమధ్య బుల్లెట్ బండి మీద తిరుగుతున్న సంగతి తెలిసిందే. తన బుల్లెట్ ప్రూఫ్ కారు పదేపదే మొరాయిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం దాన్ని మార్చడం లేదని నిరసనగా.. కొద్ది కాలం క్రితం వాహనాన్ని ప్రగతిభవన్ గేటు ఎదుట వదిలేసి వచ్చారు. ఆ సమయంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు తన బుల్లెట్ బండి మీద వచ్చి.. వినూత్న రీతిలో నిరసన తెలిపి.. అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం రాజాసింగ్ కు తెలంగాణ ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది.
సోమవారం రాజా సింగ్ కి వేరే బుల్లెట్ వాహనాన్ని ప్రభుత్వం సమకూర్చింది. ఈ వాహనం 2017 మోడల్ ది కావడం గమనార్హం. దీని మీద రాజా సింగ్ స్పందించారు. ‘తెలుపు రంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ధూల్‌పేట్‌లోని మా ఇంటి దగ్గర వదిలి వెళ్ళినట్లు తెలిసింది. నేను శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు ఇప్పుడే బయలుదేరాను. నేరుగా ఇంటికి వెళతాను. వెళ్లిన తర్వాత ఆ వాహనం కండిషన్ ఎలా ఉందో ఒకసారి పరీక్షిస్తాను. నాకు కొత్త బండి కావాలనే పట్టుదల ఏమీ లేదు. వాహనం మంచి కండిషన్‌లో ఉంటే చాలు’ అని అన్నారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 11వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన టూవీలర్‌పై రావడం ఆశ్చర్య కలిగించింది. ఫిబ్రవరి 10వ తేదీరోజు ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే రాజా సింగ్… అక్కడే తన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని వదిలేసి వచ్చారు. తరచూ ఆ వెహికల్ మొరాయిస్తుందని ఆరోపిస్తూ తనకు అలాంటి వెహికల్ వద్దని వదిలేసి వచ్చారు. దీంతో ఇవాళ టూవీలర్‌పై వచ్చారు. ప్రగతి భవన్ వద్ద వదిలి పెట్టిన కారును పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.