Telangana: SC, Constable cutoff marks reduction
mictv telugu

తెలంగాణ: ఎస్సై, కానిస్టేబుల్ కటాఫ్ మార్కులు తగ్గింపు

October 3, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి, అభ్యర్ధులకు అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్ మార్కులను తగ్గిస్తూ, ఆదివారం రోజున ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ప్రకటించిన ప్రకటనలో..”ఎస్సై, కానిస్టేబుల్ ప్రలిమినరీ పరీక్షలో మొత్తం 200 మార్కులకు గానూ..ఓసీ అభ్యర్థులకు 30 శాతం (60 మార్కులు), బీసీ అభ్యర్థులు 25శాతం (50 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు 20 శాతం (40) మార్కులు వస్తే చాలు, వారు అర్హత సాధించినట్లే. గతంలో జరిగిన పరీక్షల్లో కటాఫ్ మార్కులు ఓసీలకు 40 శాతం. బీసీలకు 35 శాతం. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు 30 శాతంగా ఉండేవి. గత ఆగస్టులో జరిగిన పరీక్షలకు మాత్రం అందరికీ 30 శాతమే కటాఫ్‌గా నిర్ణయించాం. దీంతో ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరిపాము” అని పేర్కొన్నారు.

ఇక, ఈ కటాఫ్ మార్కుల విషయంపై తాజాగా అసెంబ్లీలో కూడా ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు మార్కుల్ని తగ్గిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తాజాగా హోంశాఖ ఓసీ, బీసీలకు కూడా కటాఫ్ మార్కులను తగ్గిస్తూ, తాజాగా నిర్ణయం తీసుకుంది.

చివరగా ప్రిలిమ్స్ ఫలితాల విషయానికొస్తే..వాస్తవానికి గత నెలలోనే ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. కానీ, కటాఫ్ మార్కుల తగ్గింపుపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు అది వెలువడటంతో ప్రాథమిక రాత పరీక్ష ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. త్వరలోనే ఫలితాలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.