తెలంగాణ ఎస్టీ, ఎస్సీ కమిషన్‌కు మూడేళ్లు.. బాధితులకు అండగా.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ఎస్టీ, ఎస్సీ కమిషన్‌కు మూడేళ్లు.. బాధితులకు అండగా..

February 24, 2021

Telangana SC ST Commission progress.jp

కొత్త రాష్ట్రంలో కొత్త ఆశలతో.. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటైన తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మూడేళ్లు పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఏ మూల దళిత, గిరిజనులకు కష్టం కలిగినా తానున్నంటూ అండగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఫిర్యాదుల పరిష్కారంలోను, బాధితులకు నష్టపరిహారం చెల్లింపులోను, కుల వివక్ష నిర్మూలన, హక్కుల పరిరక్షణలోను కమిషన్ ఇతర రాష్ట్రాల్లోని కమిషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఒకప్పుడు సొంత కార్యాలయం కూడా లేని కమిషన్ నేడు దళిత, గిరిజనుల ఆత్మగౌరవ వేదికగా నిలిచింది. దేశంలోనే తొలిసారిగా జన అదాలత్ నిర్వహించిన కమిషన్‌గా ప్రశంసలు అందుకుంటోంది. చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కమిషన్ సభ్యులు అహర్నిశం తమ బాధ్యతలను అంకితభావంతో పూర్తి చేస్తున్నారు. మూడేళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీనివాస్ కమిషన్ పనితీరును వివరించారు. ఆయన వెల్లడించిన వివరాలు..

కొత్త రాష్ట్రం అవతరించాక 2018లో ముఖ్యంమంత్రి సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ప్రారంభించడం తెలిసిందే. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను చైర్మన్‌గా, బోయిళ్ల విద్యాసాగర్‌, ముదావత్‌ రాంబాల్‌నాయక్‌, కుస్రం నీలాదేవి, సుంకపాక దేవయ్య, చిల్కమర్రి నర్సింహ సభ్యులుగా నియమించారు. అప్పటినుంచి కమిషన్.. దళిత, గిరిజనుల హక్కుల కాపాడ్డంలో అద్భుత ప్రగతి సాధించింది. ఎన్నో కేసులును సుమోటోగా స్వీకరించి సత్వరం పరిష్కరించింది. మూడేళ్ల ప్రస్థానంలో దాదాపు 8 వేల కేసులు పరిష్కారమ్యాయి. 13,905 మంది అట్రాసిటీ బాధితులకు రూ.78 కోట్ల పరిహారం ఇప్పించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అర్హులకు ఆధార్‌, రేషన్‌, ఓటరు కార్డులు అందేలా చర్యలు తీసుకుంది.

పౌరహక్కుల దినోత్సవం ప్రతిష్టాత్మకంగా..
సమాజంలోని పేరుకుపోయిన కులవివక్షకు వ్యతిరేకంగా కమిషన్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతినెలా 30న పౌరహక్కుల దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా జరుపుతోంది. పోలీసులతోపాటు సంబంధిత అధికారులకు అవగాహన కల్పిస్తోంది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని అలియాబాద్‌లో పదివేలమందితో జరిగిన పౌరహక్కుల దినోత్సవం చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు దాదాపు 8 వేల గ్రామాల్లో ఈ దినోత్సవాలు జరిగాయి. వీటితో పాటు బాధితుల వద్దకే న్యాయం అనే నినాదంతో జన్ అదాలత్ లను కూడా కమిషన్ నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల్లో జరిగిన అదాలత్ లలో కేసుల పరిష్కారం, విద్యార్థులకు అడ్మిషన్లు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ వంటివి పూర్తయ్యాయి.