రేపటినుంచి మోగనున్న బడిగంట.. సెలవుల పొడగింపు ఉత్తిదే.. - MicTv.in - Telugu News
mictv telugu

రేపటినుంచి మోగనున్న బడిగంట.. సెలవుల పొడగింపు ఉత్తిదే..

October 20, 2019

తెలంగాణలో ఈనెల 31 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సెలవులు పొడిగించారు అని కొందరు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే అదంతా దుష్ప్రచారం అని అలాంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదని అధికారులు స్పష్టంచేశారు. సెప్టెంబర్ చివరి వారంలో మొదలైన దసరా సెలవులు ఈ నెల 13 వరకు ఇచ్చారు. అయితే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా మరో వారం రోజులు పెరిగిన సెలవులు 19వ తేదీతో ముగిశాయి. ఈ క్రమంలో 21వ తేదీ సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. 

Schools Open.

కొందరు పనిగట్టుకుని ఇటీవల సెలవుల పొడిగించారు అంటూ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేశారు. దీంతో అబ్బా మళ్లీ సెలవులా.. ఇలా అయితే పిల్లల చదువులు ఏంకావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందరు. మొత్తానికి అది ఫేక్ ప్రచారం అని తేలింది. 20 రోజులకు పైగా మూతపడ్డ విద్యాసంస్థలు తిరిగి రేపటినుంచి ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ ప్రకటించారు. ఈనెల 23 నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మెటివ్-1 పరీక్షలను 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఇక పరీక్షలకు సంబంధించి ఇదివరకు ప్రకటించిన టైమ్ టేబుల్ స్థానంలో కొత్త టైమ్ టేబుల్ విడుదల చేశామని పేర్కొన్నారు. ఈనెల 25నుంచి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మరోవైపు జూనియర్ కాలేజీలు కూడా సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటన విడుదల చేశారు. ఇక డిగ్రీ కాలేజీలతో పాటు ప్రొఫేషనల్ కోర్సులకు సంబంధించిన అన్నీ కాలేజీలు కూడా 21వ తేదీనుంచి తెరుచుకుంటున్నాయని వివిధ ప్రకటనల్లో ఆయా వర్సిటీల అధికారులు వెల్లడించారు.