తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు.. కేసీఆర్
దేశ రాజధానిలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధానిలో నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి ఆయన పెట్టాలని సీఎం కేసీఆర్ గురువారం నిర్ణయించారు. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.
‘‘సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. ఇది దేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోందని చెప్పారు. ‘కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలను సమానంగా గౌరవించి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడమే నిజమైన భారతీయత. ఆనాడే నిజ భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతుంది’’ అని తెలిపారు.