తెలంగాణ: నేటి ఉభయసభల్లో ఏడు బిల్లులు..అవి ఇవే..
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీన వాయిదాపడ్డ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈరోజు జరగబోయే ఉభయ సభల్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేసీఆర్ సర్కార్ సన్నద్దమయ్యింది. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లుపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. ఆ చర్చ ద్వారా రాష్ట్ర అభిప్రాయాన్ని కేంద్రానికి తెలుపనున్నారు.
అనంతరం ఇటీవలే మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావుకు సభ సంతాపం తెలుపనుంది. ఆ తర్వాత వివిధ శాఖలకు చెందిన ఏడు చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనున్నది. వీటిలో ముఖ్యంగా..
1. మున్సిపల్ శాఖ చట్ట సవరణ,
2. జీఎస్టీ చట్ట సవరణ,
3. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ,
4. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణ,
5. అటవీ వర్సిటి సంబంధించిందినది,
6. తెలంగాణ వర్సిటి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు,
7. తెలంగాణ మోటర్ వెహికిల్స్ టాక్సేషన్ సవరణ బిల్లులు ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.
అయితే, ఇందులో తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు సోమవారం అసెంబ్లీ ముందుకు రానున్నది. ఈ బిల్లును విద్యాశాఖ మంత్రి పీ. సబితా ఇంద్రారెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇదివరకే రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి కామన్ బోర్డు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాశాఖ గతంలోనే జీవో సైతం జారీచేసింది. యూజీసీ నిబంధనలు అనుసరించే కామన్ బోర్డు పనిచేస్తుందని కూడా ప్రభుత్వం తెలియజేసింది.