Telangana should have a separate flag: Revanth Reddy
mictv telugu

తెలంగాణను విముక్తం చేసింది కాంగ్రెసే, మేమొస్తే ప్రత్యేక జెండా.. రేవంత్

September 12, 2022

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాం పాలన నుంచి ప్రజలకు స్వేచ్ఛ కల్పించి వారిని విముక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, కానీ, ఆ క్రెడిట్‌ని బీజేపీ టీఆర్ఎస్ హైజాక్ చేస్తున్నాయని అన్నారు. ఆ రెండు పార్టీల కుట్రలను తరిమికొట్టాలని ప్రజలను కోరారు. అలాగే జాతీయ జెండాలాగా, తెలంగాణకు కూడా ప్రత్యేక జెండా ఉండాలనే ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఉద్యమానికి ఊపిరిలూదిన జయజయహే తెలంగాణ పాటను కాలగర్భంలో కలిపేశారని, తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణలో సబ్బండ వర్ణాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించామని, ఆ మేరకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మునుగోడులో పాల్వాయి స్రవంతిని గెలిపించుకోవాల్సి బాధ్యత అందరిమీద ఉందని, బీజీపీ, టీఆర్ఎస్ పార్టీలను ఓడించాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలని మనవి చేశారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం పేరిట మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తోందని బీజేపీపై మండిపడ్డారు. ఇక టీఆర్ఎస్‌ను పోలి ఉన్న వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ టీఎస్‌ను మార్చి టీజీగా పెట్టుకోవాలనే ప్రతిపాదన ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాగే పెట్టుకుందామని పేర్కొన్నారు.