తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న శారీరక, సామర్థ్య పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 5న ఈ పరీక్షలు ముగుస్తాయి. ఇక అభ్యర్థులకు మరో కీలక సమాచారంను పోలీస్ నియామక మండలి అందించింది. ఫిజికల్ ఈవెంట్స్‌లో అర్హత సాధించిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్చి 12 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్ 9న సివిల్ ఎస్ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇతర వివరాల కోసం https://www.tslprb.in/ వెబ్సైట్ చూడొచ్చు.
పోలీస్ ఈవెంట్స్ సందర్భంగా ఇటీవల అనేక అంశాలు వివాదాస్పదమవుతున్నాయి. డిజిటనల్ మీటర్లలో తప్పులు వస్తున్నాయని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈవెంట్స్ లో అర్హత సాధించిన వారు, సెలక్ట్ అయి ఉద్యోగం చేస్తున్న వారు ఇప్పుడు అర్హత సాధించలేకపోతున్నామని వాపోతున్నారు. అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు వినియోగిస్తున్న డిజిటల్ మీటర్లలో తప్పుడు ఫలితాల కారణంగా తాము అర్హత కోల్పోయామంటూ ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై రాజేందర్ అనే అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించాడు.