తెలంగాణ: ఎస్‌ఐ నిర్వాకం..పెళ్లి పేరుతో పదేళ్లుగా సహజీవనం
తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్ సీఐ నాగేశ్వర్‌రావుపై ఓ విహహిత తన భర్తపై దాడి చేసి, తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఫిర్యాదు చేసిన ఘటన మరువకమునుపే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఎస్సై ప్రేమ, పెళ్లి పేరుతో పదేళ్లపాటు ఓ యువతితో సహజీవనం చేస్తూ, ఆమెకు వస్తున్న పెళ్లి సంబంధాలను చెడగొడుతూ, వేధింపులకు గురి చేస్తున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి తండాకు చెందిన ధీరావత్ ఝాన్సీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుంది. తన దూరపు బంధువైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లికి చెందిన ధరావత్ విజయ్‌తో పదేళ్ల క్రితం ఆమెతో పరిచయం ఏర్పడింది. విజయ్ హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో సీసీఎస్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో ఓ ఇల్లును అద్దెకు తీసుకొని, ఆమెతో పదేళ్లుగా సహజీవనం చేశాడు. అంతేకాదు, అతని కాదని వేరే వ్యక్తిని వివాహం చేసుకోవద్దని, వచ్చిన పెళ్లి సంబంధాలను చెడగొడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని..బాధితురాలు ఈనెల 8వ తేదీ రాత్రి మిర్యాలగూడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు విజయ్‌పై అత్యాచారం, చీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. విజయ్‌ను సస్పెండ్ చేయడంతోపాటు, సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐని అదుపులోకి తీసుకునేందుకు సదరు పోలీసులు, బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం.