తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోరం జరిగింది. ఎంతో కష్టపడి సింగరేణీలో ఉద్యోగం సాధించి, సూపర్వైజర్ స్థాయికి ఎదిగిన ఓ ఉద్యోగి రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. కొడుకు ఆత్మహత్యతో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉద్యోగి ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించారు.
”గోదావరిఖనిలో నివాసముంటున్న దాతు రాజన్న, మల్లీశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కొడుకు ప్రశాంత్(25). 2017 నుంచి సింగరేణిలో ఓవర్‌మెన్‌గా (సూపర్వైజర్) పని చేస్తున్నారు. ఇటీవల అండర్ మేనేజర్ (అధికారి) పరీక్ష రాసి కూడా పాసైయ్యాడు. ప్రశాంత్.. సింగరేణి జట్టు తరఫున క్రికెట్ ఆడేవారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో కొంత డబ్బు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అవసరాల కోసం ‘మనీవ్యూ’ అనే యాప్ నుంచి రూ.60వేలు రుణం తీసుకున్నాడు.
అయితే, ప్రశాంత్ సకాలంలో చెల్లింపులు చేల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు బెదిరించటం మొదలుపెట్టారు. అతనికి ఫోన్ చేసి బూతులు తిట్టడం, ప్రశాంత్ వేరే మహిళతో నగ్నంగా ఉన్నట్టు ఫొటోలను మార్ఫింగ్ చేసి తల్లికి వాట్సాప్ చేశారు. అంతేకాదు, తండ్రి రాజన్న ఫోన్లో డీపీగా పెట్టిన తల్లిదండ్రుల ఫోటోపై అసభ్య పద జాలంతో మాటలు రాసి, వాట్సాప్‌లో పోస్టు పెట్టారు. ఆయా ఫొటోలను ప్రశాంత్ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేశారు.
దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయి, 9వ తేదీ సాయంత్రం రామగుండం – రాఘవాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య కేరళ ఎక్స్‌ప్రెస్ వస్తుండగా రైలు పట్టాలపై ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు” అని కారణాలను వెల్లడించారు.