టెన్త్ విద్యార్థులకు కరోనా స్ట్రోక్.. మళ్లీ వాయిదాపడ్డ పరీక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

టెన్త్ విద్యార్థులకు కరోనా స్ట్రోక్.. మళ్లీ వాయిదాపడ్డ పరీక్షలు

June 6, 2020

SSC Exams.

కరోనా కారణంగా వాయిదాపడ్డ పదో తరగతి పరీక్షలను.. తిరిగి జూన్ 8 నుంచి ప్రారంభించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధి మినహా రాష్ట్రంలోని మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహించవచ్చంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను మొత్తానికే వాయిదా వేసింది. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో ఒకసారి, జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి పరీక్షలు నిర్వహించడం కన్నా ప్రస్తుతానికి వాయిదా వేయడమే సబబుగా భావించింది. కరోనా మొత్తం సమసిపోయాక రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టాక పరీక్షలు ఎప్పుడు నిర్వహించే అంశంపై మరోసారి ప్రభుత్వం కొత్త తేదీ ప్రకటించే అవకాశం ఉంది. 

ప్రస్తుతం కరోనా వల్ల హైదరాబాద్‌లో పరీక్షలకు హాజరుకాలేని వారికి సప్లిమెంటరీలో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. వారిని కూడా రెగ్యులర్ కిందే పరిగణిస్తామని హామీ ఇచ్చింది. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహిస్తే అభ్యంతరం ఏంటని కోర్టు ప్రశ్నించగా, దాని వల్ల సాంకేతిక సమస్యలు వస్తాయని.. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాత అది సాధ్యం కాదని ఏజీ, కోర్టుకు తెలిపారు. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకున్న కోర్టు జీహెచ్ఎంసీ మినహా మిగిలినచోట్ల పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఈక్రమంలో రెండుసార్లు నిర్వహించడం కష్టమనే ఉద్దేశంతో ప్రభుత్వం మొత్తానికి వాయిదా వేసింది.

కాగా, తెలంగాణలో జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కేవలం పరీక్షల మీద దృష్టి పెట్టిందే కానీ, విద్యార్థుల ప్రాణాల మీద దృష్టి పెట్టలేదని వాదించారు. పంజాబ్ తరహాలో పరీక్షలు లేకుండానే గ్రేడ్లు ఇచ్చే విధానాన్ని పరీశీలించాలని కోరారు.