హైదరాబాద్ నగరంలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. వీధికుక్కలు పసివాడిని పీక్కుతిన్నాయన్న వార్తతో తీవ్ర విమర్శలు రావడంతో నగర అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే మిగిలిన పనులన్నింటినీ వదిలేసి ఆపరేషన్ డాగ్స్ పేరుతో వీధి కుక్కల వెంటపడి పట్టుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకూ 500 కుక్కల్ని పట్టుకున్నారు. కుక్కల కోసం అన్నీ వీధులు, కాలనీల్లో తిరుగుతున్నారు. వారిని చూసి వీధి కుక్కలు పారిపోతున్నాయి. అటు పాతబస్తీలో AIMIM కూడా స్పెషల్ ఆపరేషన్ చేపట్టి… కుక్కల్ని అధికారులు పట్టుకునేలా చేస్తోంది.
మరోవైపు నగరంలో కుక్కల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో నాలుగు ఘటనలు వెలుగుచూశాయి. హైదరాబాద్ చైతన్యపురిలోని మారుతీ నగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల పిల్లాడు రిషిపై వీధి కుక్కలు దాడి చేశాయి. పిల్లాడు కేకలు వెయ్యడంతో.. ఆ అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి వచ్చి… పిల్లాణ్ని కాపాడారు. అప్పటికే ఆ కుక్కలు.. పిల్లాడి వీపు, కాలిని కరిచేశాయి. కరీంనగర్‌లోని శంకరపట్నం ఎస్సీ హాస్టల్ లోకి వెళ్లి మరీ కుక్కలు సుమంత్ అనే విద్యార్థిపై దాడి చేశాయి. అప్రమత్తమైన మిగతా వారు అతన్ని కాపాడారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి మరో రెండు ఘటనలు కూడా జరిగినట్లు తెలిసింది.
మొత్తంగా రాష్ట్రంలో వీధి కుక్కల సమస్య తలనొప్పిగా ఉంది. అధికారులు వాటిన పరుగులు పెడుతున్నారు. ఇదే పని ఇంతకుముందే చేసి ఉంటే.. ఆ చిన్నారి ప్రాణాలు దక్కేవే. అంతా అయిపోయాక.. ఇప్పుడు ఏం చేసి ఏం లాభం అని కొందరు విమర్శిస్తుంటే.. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచారని మరికొందరు అంటున్నారు.