తెలంగాణకు మూడు జాతీయ అవార్డులు.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు మూడు జాతీయ అవార్డులు..

September 22, 2019

Telangana ....

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సక్సెస్‌ఫుల్ అయ్యాయి. ఇక్కడి పథకాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా తీసుకునేలా పథకాలకు రూపకల్పన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. పథకాలు మంచివైనప్పుడు గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. 

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన మూడు శాఖలను జాతీయ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నీటి పారుదల, భూగర్భ జలవనరుల శాఖ, మిషన్ భగీరథలకు  జాతీయ జల మిషన్‌ అవార్డు-2019 లభించాయి. జల వనరుల పరిరక్షణ, ఉత్తమ నీటి నిర్వహణ విధానాలను అమలు చేస్తున్న సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రాజెక్టు నుంచి కేంద్ర జల సంఘం, కేంద్ర భూగర్భ జల వనరుల శాఖ దరఖాస్తులను ఆహ్వానించాయి. 

ఆ దరఖాస్తుల నుంచి వడపోసి ఉత్తమమైన వాటిని ఎంపిక చేశాయి. ఆయా సంస్థలకు జాతీయ జల మిషన్‌ అవార్డులు-2019 పేరుతో పురస్కారాలు ప్రకటించాయి. మొత్తం పది విభాగాల్లో పనితీరును చూసి అవార్డులకు ఎంపిక చేశాయి. ఈ క్రమంలో మొదటి కేటగిరి (ఎ) కింద తెలంగాణ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రాజెక్టుల కన్నా ముందు వరసలో నిలిచింది. సాగునీటి సమాచార వ్యవస్థ (టీడబ్ల్యూఆర్‌ఐఎస్‌) నిర్వహణ తీరు బాగుండటంతో అవార్డు దక్కింది. మూడవ కేటగిరిలో భూగర్భ జల వనరుల నిర్వహణను పకడ్బందీగా నిర్వహిస్తున్న రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ ఎంపికైంది. ఇక నాలుగో కేటగిరి (సి)లో మిషన్ భగీరథ నిలిచింది. ఇంటింటికి తాగునీరు అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అన్న విషయం తెలిసిందే. ప్రకటించిన ఈ పురస్కారాలను ఈ నెల 25వ తేదీన ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఈ అవార్డులను అందజేయనున్నారు.