అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంది.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంది.. కేసీఆర్

March 17, 2019

కరీంనగర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కరీంనగర్ వేదికగా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ ప్రారంభించింది. సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘దేశంలోనే శాసించే విధంగా తెలంగాణ వుండాలి. అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచింది. దేశంలో ఫెడరల్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఎంతో వుంది. ఐదేళ్ల కిందటి తెలంగాణను గుర్తు చేసుకుంటే భయమేస్తుంది. ఆనాడు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. ఆనాడు ప్రాజెక్టులు కట్టాలంటే దశాబ్దాల కాలం పట్టేది.

Telangana state number one in all fields .. CM KCR.

ఐదేళ్ల నాటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా తేడా ఉంది. ఆరు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్ జిల్లా అమృతధారలా ఉంటుంది. దేవాదుల, మేడిగడ్డ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. కరెంట్ రంగంలో అద్భుతం సృష్టించాం. యావత్ భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నెంబర్‌‌వన్ స్టేట్‌గా నిలిచింది. ఇవి నేను అంటున్న మాటలు కావు.. భారతదేశ విద్యుత్ ప్రాధికార సంస్థ చెప్పిన మాటలు.

తలసరి విద్యుత్ వినియోగం, ఆదాయవృద్ధిలో నెంబర్‌వన్‌గా ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీకి ధాన్యం ఎగుమతి చేస్తున్నాం. 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే నేడు 54 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తున్నాం’ అని తెలిపారు సీఎం కేసీఆర్.