Telangana: Students.. Extension of deadline for 'Dost' web options
mictv telugu

తెలంగాణ: విద్యార్థుల్లారా..వెబ్ ఆప్షన్ల గడువు పెంపు

July 27, 2022

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ చదవాలని ఆశగా ఉన్న విద్యార్థినీ, విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ‘దోస్త్’ వెబ్ ఆప్షన్ల గడువును పెంచుతూ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.

విడుదల చేసిన ప్రకటనలో..”డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశించేందుకు ఈ నెల 26వ వరకు మొత్తం 1.10 లక్షల మంది రూ. 200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో దరఖాస్తు సమర్పించింది మాత్రం 83,611 మందే. వెబ్ ఆప్షన్లను కేవలం 68,178 మందే ఇచ్చుకున్నారు. అంటే 42,158 మంది ఏ కోర్సులో, ఏ సబ్జెక్టులను ఎంచుకోవాలో ఇంకా ఆప్షన్లు ఇవ్వలేదు. కావున ఈ నెల 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాం” అని తెలిపారు.

అనంతరం ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష కొత్త హాల్ టికెట్లను అధికారులు మంగళవారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ నెల 30,31వ తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఈ పరీక్షలు జరగాలి కానీ, వర్షాల కారణంగా అధికారులు వాయిదా వేశారు. మళ్లీ కొత్త తేదీలను ప్రకటించి, పరీక్షలను నిర్వహిస్తున్నారు.