Telangana: Students..Secondary English Syllabus has changed
mictv telugu

తెలంగాణ: విద్యార్థుల్లారా..సెకండియర్ ఇంగ్లీషు సిలబస్ మారింది

July 8, 2022

second

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఇంటర్ బోర్డు అధికారులు, సబితా ఇంద్రారెడ్డి ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్‌లో మార్పులు చేశామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్‌తో కూడిన ఇంగ్లిష్ పుస్తకాలను ముద్రించామని త్వరలోనే వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొన్నారు. కాబట్టి విద్యార్థినీ, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, మార్కెట్లోకి ఇంగ్లీషు కొత్త పుస్తకం విడుదలైన వెంటనే కొనుక్కోవాలని కోరారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం తన కార్యాలయంలో ఇంటర్ సెకండియర్ కొత్త ఇంగ్లిష్ పుస్తకాలను అధికారులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ మాట్లాడుతూ..”ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌ సిలబస్ మారింది. కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాన్ని విడుదల చేశాం. త్వరలోనే ఈ కొత్త పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. ప్రతి విద్యార్ధినీ, విద్యార్థులు ఈ కొత్త పుస్తకాన్ని తీసుకోండి. అలాగే, తాజాగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రం పాత సిలబస్ ప్రకారమే సప్లి పరీక్ష ఉంటుంది” అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు, కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.