Telangana: Students..this year also the old fees
mictv telugu

తెలంగాణ: విద్యార్థుల్లారా..ఈ ఏడాది కూడా అవే ఫీజులు

August 2, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతకొన్ని నెలలుగా ఈ ఏడాది రాష్ట్రంలో బీటెక్ విద్యను అభ్యసించే విద్యార్థుల విషయంలో ప్రతి కోర్సుకు సంవత్సరానికి ఎంత ఫీజును కేటాయించాలి?, ప్రతి సెమిస్టర్‌కు ఫీజు ఎంత? కాలేజ్ ఫీజు ఎంత? అనే తదితర విషయాలపై అధికారులు చర్చోపచర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయినా, బీటెక్ కోర్సుల ఫీజుల విషయంలో మాత్రం ఓ అధికారిక నిర్ణయానికి మాత్రం రాలేకపోయారు.

 

ఈ క్రమంలో ఇంజినీరింగ్ విద్య‌ను అభ్య‌సించే విద్యార్ధినీ, విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ సోమవారం భారీ ఊర‌ట‌ను ఇస్తూ, ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సుల‌కు పాత ఫీజులనే అమ‌లు చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌వేశాలు, ఫీజుల నియంత్ర‌ణ క‌మిటీ (టీఎస్ఏఎఫ్ఆర్‌సీ) నిర్ణ‌యిస్తూ, ఆయా కాలేజీలకు ఆదేశాలను జారీ చేసింది. అంటే ఈ సంవత్సరానికి కూడా గత సంవత్సరంలో ఎంతెంత ఫీజులు కట్టారో, అవే ఫీజులను చెల్లించాలన్నమాట.

”ఈ ఏడాది రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య‌కు సంబంధించిన ఫీజుల‌ను పెంచాలని క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంది. ఆయా క‌ళాశాల‌లు కూడా తమ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు పెరుగుతుండడంతో ఫీజుల‌ను పెంచాల్సిందేన‌ని క‌మిటీని కోరాయి. కానీ, క‌రోనా కారణంగా కుటుంబాల ఆర్థిక ప‌రిస్థితి ఛిన్నాభిన్నం అయింది. ఆ ప‌రిస్థితుల‌పై సోమ‌వారం జరిగిన స‌మావేశంలో క‌మిటీ ప్ర‌త్యేక దృష్టి సారించింది. సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్య‌కు పాత ఫీజుల‌నే కొన‌సాగించాల‌ని క‌మిటీ నిర్ణ‌యించింది. ఫ‌లితంగా గ‌తేడాది వ‌సూలు చేసిన ఫీజుల‌నే ఆయా క‌ళాశాల‌లు ఈ ఏడాది కూడా వ‌సూలు చేస్తాయి” అని విడుదల చేసిన ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.