Telangana: Teachers
mictv telugu

తెలంగాణ: అధ్యాపకుల్లారా..ఇవి ఉంటేనే ఉద్యోగం

July 8, 2022

తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలో ఉన్న ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో కొత్త కలవరం మొదలైంది. ఇకపై ప్రభుత్వ కళశాలల్లో అధ్యాపకులుగా ఉద్యోగం చేయాలంటే.. పీజీతోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్), స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్టు(సెట్)లో అర్హత సాధించిన వారు లేదా పీహెచ్.డి పూర్తి చేసిన వారే అర్హులని ప్రభుత్వం ఓ నిబంధనతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో కొన్ని సంవత్సరాలుగా పీజీ అర్హతతో డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్తున్నా అధ్యాపకుల్లో ఆందోళన మొదలైంది.

రాష్ట్రవ్యాప్తంగా పీజీతోపాటు, నెట్, సెట్, పీహెచ్.డిలు ఉన్న 288 మంది పేర్లను ఉన్నత విద్యాశాఖకు పంపినట్లు సమాచారం. మొత్తం 129 కళాశాలల్లో 811 మందికి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారిలో 288కి తప్ప, మిగిలిన 528 మందికి కేవలం పీజీ విద్యార్హత మాత్రమే ఉంది. ఇప్పుడు అదనపు అర్హత తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వానికి జాబితాను పంపిస్తుండటంతో మిగిలిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

”ఈ అర్హతలను ప్రభుత్వం 2009లో నోటిఫై చేసి, 2011లో తప్పనిసరి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2010లో జూనియర్ అధ్యాపకులకు జీఓ 128 ద్వారా డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతి కల్పించింది. ఆనాడు అదనపు అర్హతలు ఏమీ లేవు. అయిదు సంవత్సరాలలోపు అర్హత పొందేలా షరతు విధించారు. అది సాధించని వారికి రాష్ట్ర వేతనం ఇచ్చారు. 2018లో మిర్యాలగూడలోని కేఎన్ఎం ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మార్చినప్పుడు కూడా 30 మంది అధ్యాపకులను పీజీ అర్హతతోనే క్రమబద్ధీకరించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి అదనపు అర్హత కోసం అయిదేళ్ల సమయం ఇవ్వాలి” అని అధ్యాపకులు మంత్రులకు, అధికారులకు వినతి ప్రత్రాలు అందజేశారు. మరి ప్రభుత్వం ఈ విషయంపై ఏవిధంగా స్పందిస్తుందోనని అధ్యాపకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.