Telangana: Tet OMR Sheets on Website!: SCERT
mictv telugu

తెలంగాణ: వెబ్‌సైట్‌లో టెట్ ఓఎంఆర్ షీట్లు!: ఎస్​సీఈఆర్టీ

July 9, 2022

Telangana: Tet OMR Sheets on Website!: SCERT

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన టెట్ అభ్యర్థులు గతకొన్ని రోజులుగా టెట్ ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో పెడతారా? లేదా? అంటూ హైదరాబాద్‌లో ఉన్న టెట్ కార్యాలయం వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. టెట్‌లో తమకు తీరని అన్యాయం జరిగిందని, ఓఎంఆర్ షీట్లను వెంటనే వెబ్‌సైట్‌లో పెట్టాలని వేలమంది అభ్యర్థులు అధికారులకు వినతిపత్రాలను అందజేస్తున్నారు. అయినప్పటికి ఎస్‌సీఈఆర్టీ అధికారులు మాత్రం వెనకాముందు ఆడుతున్నారు.

ఓ ఉన్నతాధికారి ఈ టెట్ ఓఎంఆర్ షీట్లకు సంబంధించిన తాజా విషయాన్ని తెలియజేశారు. టెట్ ఫలితాలు వెల్లడైనందున త్వరలో అభ్యర్డుల అభ్యర్థన మేరకు ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో ఉంచాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) భావిస్తోంది. పరీక్షకు సంబంధించి తుది కీ వెలువడిన తర్వాత కొన్ని ప్రశ్నలకు మార్కులు కలుస్తాయని అభ్యర్థులంతా భావించారు. కానీ, అందుకు భిన్నంగా మార్కులు వచ్చాయి. దీంతో అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని కార్యాలయంలో వేలకొద్ది ఫిర్యాదులు చేశారు. దీంతో టెట్ ఓఎంఆర్ పత్రాలను అధికారులు త్వరలోనే వెబ్‌సైట్లో ఉంచాలని, అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకునేలా, కొంత ఫీజును వసూలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు” అని ఆయన అన్నారు.

తెలంగాణలో..దాదాపు ఐదేండ్ల తర్వాత జూన్ 12న టెట్ పరీక్ష జరిగింది. ఈసారి పేపర్1కు 3,18,444 మంది, పేపర్​ 2కు 2,50,897 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ ప్రైమరీ ‘కీ’ని అధికారులు రిలీజ్ చేసి, అభ్యంతరాలను తీసుకోగా, పేపర్1లో 7,930, పేపర్2లో 4,663 ఆబ్జెక్షన్స్ వచ్చాయి. వీటన్నింటినీ సరిచేస్తూ ఫైనల్ ‘కీ’ని జూన్ 29న విడుదల చేశారు. ఆ తర్వాత రెండ్రోజులకు జులై 1న ఫలితాలు విడుదల చేశారు.

అయితే, పేపర్ 1లో 1,04,078 (32.68%) మంది, పేపర్ 2లో 1,24,535 (49.64%) మంది మాత్రమే అర్హత సాధించారు. టెట్ రాసిన చాలా మంది అభ్యర్థులు ఈజీగానే పేపర్ వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, రిజల్ట్ వచ్చాక అది తారుమారైంది. చాలామంది అభ్యర్థులు క్వాలిఫై కాలేదు. క్వాలిఫై అయిన అభ్యర్థులు తక్కువ మార్కులు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై హైదరాబాద్‌‌లోని ఎస్​సీఈఆర్టీకి నిత్యం అభ్యర్థులు వచ్చిపోతూ, తమకు జరిగిన అన్యాయాన్ని అక్కడి సిబ్బందికి చెప్పకుంటున్నారు. ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో పెట్టాలని వినతిపత్రాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు టెట్ ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో పెట్టే యోచనలో ఉన్నట్లు ఉన్నతాధికారి తెలిపారు.