Telangana: The first forest university..in this district
mictv telugu

తెలంగాణ: తొలి ఫారెస్ట్‌ యూనివర్సిటీ..ఈ జిల్లాలోనే

September 13, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఈ విశ్వవిద్యాలయంలో ‘అటవీ విద్య, పరిశోధన, విస్తరణ’ వంటి వాటిపై దృష్టి సారించి, దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

”ములుగు జిల్లాల్లో ఉన్న అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చనున్నాం. ఇందుకు సంబంధించి ‘తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయం చట్టం 2022’కు సంబంధించిన బిల్లును ప్రవేశపెడుతున్నాం. అటవీ వనరుల పరిరక్షణ, సుస్థిర నిర్వహణతోపాటు ఉద్యాన పంటల అభివృద్ధి, పరిశోధనకు ఈ విశ్వవిద్యాలయం దోహదపడుతుంది. సంప్రదాయక అటవీ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సహజసిద్ధమైన అడవులపై ఒత్తిడిని తగ్గించడానికి వీలుగా పరిశోధనలు చేయడం కూడా దీని బాధ్యతల్లో ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరితహారం, ప్రకృతివనాలు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు, నర్సరీలు, హరితనిధి కార్యక్రమాలను చేపట్టింది. హరితహారాన్ని నిరంతరంగా కొనసాగించాలన్న లక్ష్యసాధనకు అటవీ వృత్తి నిపుణుల లభ్యత తగినంతగా ఉంటుంది” అని బిల్లులో పేర్కొంది.

అంతేకాకుండా, కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ శాస్త్రం, అటవీ నిర్వహణ, శీతోష్ణస్థితి శాస్ర్తాల్లో నూతన కోర్సులతో పాటు ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అందించేలా అటవీ విశ్వవిద్యాలయాన్ని రూపొందించాలని ప్రతిపాదించినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు, ఈ అటవీ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చాన్స్‌లర్‌గా వ్యవహరించనున్నారు. ఈ వర్సిటీకి తొలి వీసీని చాన్స్‌లర్‌ నియమిస్తారు. ఆ తర్వాత ఉపకులపతుల నియామకం సెర్చ్‌ కమ్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై తొలుత మంగళవారం అసెంబ్లీలో, ఆ తర్వాత శాసనమండలిలో చర్చించినున్నట్లు అధికారులు తెలియజేశారు.