తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ బాధితుడు మంకీపాక్స్ లక్షణాలతో హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బాధితుడి శరీరంపై దద్దుర్లు రావడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. దాంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అతడి నుంచి ఐదు రకాల నమూనాలను సేకరించి, నిర్ధారణ కోసం పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.
ఆ వ్యక్తికి మంకీపాక్స్ వచ్చిందా? లేదా ఇతర ఏ వ్యాధి అయిన సోకిందా? అనే పూర్తి వివరాలను ప్రజారోగ్య సంచాలకుడు జి శ్రీనివాసరావు మంగళవారం రాత్రి మీడియా ముందు వెల్లడించారు. ”కామారెడ్డికి చెందిన వ్యక్తి (85)కి శరీరంపై దద్దుర్లురావడంతో ఈ నెల 24న రాత్రి హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రిలో చేరాడు. అతని నుంచి వైద్యులు.. ఈ నెల 25న ఐదు రకాల నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. మంగళవారం సాయంత్రం ఫలితాలు వచ్చాయి. అందులో మంకీపాక్స్ నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. ఆయనకు ఆటలమ్మ (చికెన్‌పాక్స్) సోకినట్లుగా తేలింది. ఇక ఖమ్మం నగర పరిసరాల్లో గ్రానైట్ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో మంగళవారం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించాం” అని ఆయన అన్నారు.